జనరిక్ కేంద్రాల నుంచే మందులు కొనండి

జనరిక్ కేంద్రాల నుంచే మందులు కొనాలని ప్రధాని నరేంద్ర మోదీ  దేశ ప్రజలను కోరారు. ఔషథాల ధరలు విపరీతంగా పెరిగిపోయినందున, తక్కువ ధరకు మందులు అందించే పిఎం జనరిక్ కేంద్రాల నుంచి మాత్రమే మందులు కొనాలని ఆయన సూచించారు. ఈ జనరిక్ కేంద్రాలు దిగువ, మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో ఉపయుక్తంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

జ‌న ఔష‌ధి దివ‌స్‌ను పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాని ఆదివారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా షిల్లాంగ్‌లో 7,500వ జ‌నరిక్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్రధాని దేశ వ్యాప్తంగా జనరిక్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని, ఈ కేంద్రాల ద్వారా దేశంలో ఎంతో మంది ఉపాథి పొందుతున్నారని తెలిపారు. జనరిక్ కేంద్రాల్లో బాలికలకు రూ. 2.5కు ఒకటి చొప్పున శానిటరీ ప్యాడ్స్ లభిస్తాయని ఆయన వెల్లడించాయిరు. 

ఇప్పటివరకు 11 కోట్ల శానిట‌రీ ప్యాడ్స్ అమ్ముడుపోయాయని ఆయన చెప్పారు. దేశంలో ఉన్న జనరిక్ కేంద్రాల్లో వెయ్యి కేంద్రాలను మహిళలే నడిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజలకే కాకుండా, ప్రపంచానికి కరోనా టీకాలను భారత్ అందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. 

భారత్ లో కరోనా టీకాల ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని,   ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఉచితంగా, ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో రూ.250కి డోస్ చొప్పున టీకా అందిస్తున్నార‌ని ప్ర‌ధాని మోదీ  వెల్లడించారు. ఇప్పటికే తాను తొలి విడత డోసు తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. కరోనా టీకా వచ్చినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వీయనియంత్రణతో కరోనా కట్టడి సాధ్యమన్న విషయాన్ని ప్రజలు మరిచిపోరాదని ఆయన తేల్చి చెప్పారు.