సుప‌రిపాల‌న కోసం క్రిప్టో క‌రెన్సీ

త‌మ ప్ర‌భుత్వం మెరుగైన సుప‌రిపాల‌న కోసం క్రిప్టో క‌రెన్సీల‌తోపాటు నూత‌న టెక్నాల‌జీల‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్న‌ద‌ని కేంద్ర ఆర్థిక‌శాఖ స‌హాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. సుప‌రిపాల‌న‌ను బ‌లోపేతం చేసేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ సుముఖం అని పంజాబ్‌లోని ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఒక స‌మావేశంలో ఆయ‌న తెలిపారు.

ఆవిష్క‌ర‌ణ‌ల‌ను, నూత‌న టెక్నాల‌జీని మ‌నం స్వాగ‌తిద్దాం.. బ్లాక్ చెయిన్ నూత‌నంగా ఆవిర్భ‌విస్తున్న టెక్నాల‌జీ.. వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ రూపం క్రిప్టో క‌రెన్సీ. నూత‌న ఆలోచ‌న‌ల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం ఎల్ల‌వేళ‌లా సిద్ధంగా ఉంటుంద‌ని చెప్పారు.

కేంద్ర ఆర్థిక‌శాఖ కార్య‌ద‌ర్శి సార‌థ్యంలో డిజిట‌ల్ క‌రెన్సీల‌పై కేంద్రం నియ‌మించిన ఉన్న‌త స్థాయి అంత‌ర్గ‌త కార్య‌ద‌ర్శుల క‌మిటీ (ఐఎంసీ) నివేదిక స‌మ‌ర్పించింది. ఐఎంసీ నివేదిక‌, సిఫార‌సుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోనున్న‌ది.

క్రిప్టో క‌రెన్సీల శ‌క్తి సామ‌ర్థ్యాల‌పై ఇంకా ప్ర‌భుత్వం ఓ నిర్ణ‌యానికి రాలేద‌ని అంతకు ముందుకేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పేర్కొన్నారు. గ‌త‌వారం భార‌తీయ రిజ‌ర్వు బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై క్రిప్టో క‌రెన్సీ తీవ్రంగా ప్ర‌భావం చూపుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.