మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు

జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ నెల 15న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరుకావాలని నోటీసులు పంపింది. 

ఈడీ అధికారులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం నమోదైన కేసులో ప్రశ్నించేందుకు మెహబూబా ముఫ్తీకి సమన్లు జారీ చేశారు. మార్చి 15న న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆమెను కోరారు. 

జమ్ముకశ్మీర్‌ పునర్విభజన నేపథ్యంలో ఏడాదికిపైగా గృహ నిర్బంధంలో ఉన్న మెహబూబా ముఫ్తీని గత ఏడాది విడుదల చేశారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌ ఏకీకరణ కోసం స్థానిక పార్టీలన్నీ కలిసి గుప్కార్‌ డిక్లరేషన్ కింద ప్రజల కూటమిగా ఏర్పడ్డాయి. 

ఈ కూటమి అధ్యక్షుడు, కశ్మీర్‌ మాజీ సీఎం, ఎన్‌సీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లాకు చెందిన రూ.12 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ గత ఏడాది జప్తు చేసిన సంగతి తెలిసిందే. జమ్మూ-కశ్మీరు క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసింది.