పాత వాహనాల స్థానే కొత్త కార్ల‌పై 5% రాయితీ

వ్య‌ర్థ‌మైన‌, పాత వాహ‌నాల‌ను వ‌దిలించుకోవాల‌ని నిర్ణ‌యించున్న వారు వాటిని అప్ప‌గించి కొత్త వాహ‌నాలను కొనుగోలు చేస్తే ఐదు శాతం రాయితీ ల‌భిస్తుంది. వెహిక‌ల్ స్క్రాపేజీ పాల‌సీలో ఈ నిబంధ‌న‌ను కేంద్రం చేర్చ‌నున్నట్లు కేంద్ర ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఓ వార్తా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి గ‌త నెల ఒక‌టో తేదీన బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌ను స‌మ‌ర్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్  వాలంట‌రీ వెహిక‌ల్ స్క్రాపింగ్ పాల‌సీని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌కు 20 ఏండ్ల త‌ర్వాత, వాణిజ్య వాహ‌నాల‌కు 15 ఏండ్ల త‌ర్వాత ఫిట్‌నెస్ టెస్ట్ త‌ప్ప‌నిస‌రి అని ప్ర‌క‌టించారు. మ‌రో 15 రోజుల్లో వెహిక‌ల్ స్క్రాపేజీ పాల‌సీని కేంద్రం వెల్ల‌డించ‌నున్న‌ది.

అందులో చేర్చే నిబంధ‌న‌ల్లో పాత వాహ‌నాల‌ను అప్ప‌గించి కొత్త వాహ‌నాల‌ను కొనుగోలు చేస్తే ఆటోమొబైల్ సంస్థ‌లు ధ‌ర‌లో ఐదు శాతం రాయితీ క‌ల్పిస్తాయ‌ని గ‌డ్క‌రీ చెప్పారు. ఈ వెహిక‌ల్ స్క్రాపేజీ పాల‌సీలో నాలుగు ప్ర‌ధాన అంశాలు ఉంటాయ‌ని పేర్కొన్నారు. ధ‌ర‌లో ఐదు శాతం రాయితీ, పాత కాలుష్య కార‌క వాహ‌నాల‌పై గ్రీన్ ట్యాక్స్‌లు, ఇత‌ర లెవీల్లో రాయితీలు ల‌భిస్తాయని చెప్పారు.

ఆటోమేటెడ్ ఫెసిలిటీల్లో ఫిట్‌నెస్‌, పొల్యూష‌న్ టెస్టులు త‌ప్ప‌నిస‌రి కానున్నాయి. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భాగ‌స్వామ్యం (పీపీపీ)తో ఫిట్‌నెస్ సెంట‌ర్లు ఏర్పాటు కానున్నాయి. స్క్రాపేజీ సెంట‌ర్ల కోసం ప్రైవేట్ భాగ‌స్వామ్య సంస్థ‌లు, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కేంద్రం చేయూత‌నివ్వ‌నున్న‌ది. ఆటొమేటెడ్ టెస్ట్‌ల్లో విఫ‌ల‌మైన వెహిక‌ల్స్‌పై భారీ జ‌రిమానా విధించ‌డం జ‌రుగుతుంద‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ వెల్ల‌డించారు.