లెక్కచూపని రూ.1000 కోట్లకు పైగా ఆదాయం 

తమిళనాడుకు చెందిన ఓ బంగారు వ్యాపారుల బృందం, దక్షిణాదిలోనే అతిపెద్ద ఆభరణాల దుకాణంగా పేరుగాంచిన సంస్థలో జరిపిన సోదాల్లో రూ.1,000 కోట్ల నల్లధనం బయటపడిందని ఐటీ శాఖ వెల్లడించింది. అయితే ఆ వ్యాపారి, సంస్థ పేరును మాత్రం చెప్పలేదు.

ఈ నెల 4వ తేదీన చెన్నై, ముంబై, కోయంబత్తూర్‌, మదురై, తిరుచిరాపల్లి, త్రిశ్శూర్‌, నెల్లూరు, జైపూర్‌, ఇండోర్‌లో సదరు సంస్థకు చెందిన 27 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌(సీబీడీటీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. రూ. 1.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నట్టు పేర్కొన్నది.

నకిలీ ఖాతాల ద్వారా లావాదేవీలు, బోగస్‌ క్యాష్‌ క్రెడిట్లు, నోట్ల రద్దు సమయంలో లెక్క చూపని నగదు డిపాజిట్లు ఇలా అనేక అక్రమాలను సోదాల సందర్భంగా గుర్తించినట్టు చెప్పింది. లెక్క చూపని డబ్బు రూ. వెయ్యి కోట్లు ఉందన్నది. ఏప్రిల్‌ 6న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

సంస్థల బ్రాంచీల్లో లెక్క చూపని నగదు అమ్మకాలు, నకిలీ నగదు అప్పులు, డమ్లీ అకౌంట్లలో నగదు అప్పులు వంటి ఆధారాలతో ఈ లెక్క చూపని ఆదాయాన్ని ఆధికారులు గుర్తించారు. తదుపరి విచారణ పురోగతిలో ఉందని అధికారులు తెలిపారు.