పంజాబ్ ఎమ్మెల్యే ఖైరా ఆస్తుల‌పై ఈడీ దాడులు

పంజాబ్ ఏక్తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌సింగ్ ఖైరా ఆస్తుల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) దాడులు నిర్వ‌హించింది. పంజాబ్‌లోని ఐదు ప్రాంతాల్లో, చండీగ‌ఢ్‌లో ఒక‌చోట‌, ఢిల్లీలో రెండు చోట్ల సుఖ్‌పాల్ ఆస్తుల‌పై ఈడీ సోదాలు చేసింది. 

2017లో  ఆమ్ఆద్మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సుఖ్‌పాల్ సింగ్ 2019లో ఆ పార్టీ నుంచి బ‌య‌టికి వ‌చ్చి పంజాబ్ ఏక్తా పార్టీ పేరుతో ఒక పార్టీని స్థాపించాడు. పంజాబ్‌లోనేగాక విదేశాల్లో కూడా ఆయ‌న పార్టీకి సంఘాలు ఉన్నాయి.

అయితే, ఇటీవ‌ల ఆయ‌న‌పై ఈడీ మ‌నీలాండ‌రింగ్‌, న‌కిలీ పాస్‌పోర్టు రాకెట్ కేసులను న‌మోదు చేసింది. కేసు ద‌ర్యాప్తులో భాగంగా మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఈడీ అధికారులు చండీగ‌ఢ్‌, పంజాబ్‌, ఢిల్లీలోని సుఖ్‌పాల్ నివాసం, కార్యాల‌యాల‌పై ఏక కాలంలో దాడులు నిర్వహించింది. 

ఆయ‌న స్థిర‌, చ‌ర ఆస్తుల‌కు సంబంధించిన ప‌త్రాల‌ను, బ్యాంకు లావాదేవీల‌ను ప‌రిశీలించింది. అంతేగాక‌, జ‌న‌వ‌రి 26న ఢిల్లీలో రైతుల ట్రాక్ట‌ర్ ర్యాలీ సంద‌ర్భంగా న‌వ్‌రీత్‌సింగ్ అనే యువ‌రైతు మృతి వెనుక కూడా సుఖ్‌పాల్ ప్ర‌మేయం ఉన్న‌ట్లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.    

మాదకద్రవ్యాల రవాణ, నకిలీ పాస్ పోర్టు కేసుల్లో ఈడీ అధికారులు ఎమ్మెల్యే సుఖ్ పాల్ సింగ్ పై దాడులు చేసి దర్యాప్తు జరిపారు. సుఖ్ పాల్ సింగ్ పై మనీలాండరింగ్ కేసు నమోదు చేశామని ఈడీ అధికారులు చెప్పారు.