రుణాల మంజూరు ప్రక్రియ పారదర్శకంగా సాగాలి  

రుణాల మంజూరు ప్రక్రియ పారదర్శకంగా సాగాలని, ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరించరాదని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణ్యన్‌ స్పష్టం చేశారు. క్రోనీ లెండింగ్‌కు దూరంగా ఉండాలన్న ఆయన.. దేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరేందుకు సమర్థులకు రుణాలు అందడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
 మంగళవారం వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో సుబ్రమణ్యన్‌ మాట్లాడుతూ  భారతీయ బ్యాంకింగ్‌ రంగంలో రుణాల మంజూరు పేలవంగా ఉందని, 1990 ఆరంభం నుంచే అలా కొనసాగుతూ వస్తున్నదని పేర్కొన్నారు. ముఖ్యంగా భారీ రుణాల విషయంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఉదారంగా వ్యవహరిస్తున్నాయంటూ అర్హులకు మాత్రం రుణాలు అందడం లేదని, పలుకుబడిగల పెట్టుబడిదారులకే ప్రాధాన్యత లభిస్తున్నదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
అలాగే ఫలానా రంగానికే రుణాలు ఇవ్వాలని రుణదాతలు నిర్ణయించుకుంటున్నారని, అసమర్థులైనా వారికే రుణసాయం దక్కుతున్నదని చెప్పారు. దీనివల్లే ఇన్ని నిరర్థక ఆస్తులు (మొండి బకాయిలు లేదా ఎన్‌పీఏలు) పేరుకుపోయాయని వివరించారు. ఈ క్రమంలోనే ఆయన మౌలిక రంగంలోని ఏన్‌పీఏలను గుర్తుచేశారు. రుణాల మంజూరు సక్రమంగా జరిగేందుకు అన్ని ఆర్థిక సంస్థల్లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ బలోపేతం కావాలని ఈ సందర్భంగా సీఈఏ సూచించారు.
సీనియర్‌ మేనేజ్‌మెంట్‌కు ప్రోత్సాహకాలను ఇవ్వాల్సిన అవసరం ఉందని చెబుతూ దీనివల్ల పారదర్శకత పెరిగి అర్హులకు రుణాలు అందుతాయని, అభివృద్ధికి ఆస్కారమున్న రంగాలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, మౌలిక రంగ ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించేందుకు రూ.లక్ష కోట్లతో ఓ డెవలప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు తెలియజేశారు.