పాక్ లో హిందూ కుటుంబం దారుణహత్య

పాకిస్తాన్‌లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. గత నెలలో హిందూ పూజారిని కత్తులతో పొడిచి చంపిన ఘటన మరువక ముందే మరో దారుణం జరిగిపోయింది. శుక్రవారం రాత్రి ఒక కుటుంబంలోని ఐదుగురు దారుణహత్యకు గురయ్యారు. 

వీరి మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. రహీం యార్‌ ఖాన్‌ సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబుదాబి కాలనీలోని ఓ ఇంట్లో హిందూ కుటుంబం గత కొంత కాలంగా నివాసం ఉంటున్నది.

రెండు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు వీరిపై కత్తులు, కర్రలతో దాడికి తెగబడి వారిని చితకబాదడమే కాకుండా వారి గొంతులు కోసి దారుణంగా హతమార్చారు. మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలం నుంచి పోలీసులు కత్తులతోపాటు ఒక గొడ్డలిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

మృతుల్లో ఒకరిని రామ్‌చంద్‌ మేఘావల్‌, 36 ఏండ్ల యువకుడిగా స్థానిక హక్కుల సంఘం నేత బీర్బల్‌ దాస్‌ గుర్తించినట్లు తెలిపారు. టైలరింగ్ చేస్తూ పొట్టపోసుకునే వాడని ఆయన చెప్పారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయోత్సాతానికి లోనయ్యారు.

నిందితులను అదుపులోకి తీసుకుని శిక్షించాలని స్థానిక హక్కుల సంఘాలు డిమాండ్‌ చేశాయి. హిందువులను చంపడం ఇకనైనా ఆపాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.