కేరళలో ఆర్ ఎస్ ఎస్ నేతతో చర్చ్ ప్రముఖల భేటీ   

కేరళలో ఆర్ ఎస్ ఎస్ నేతతో చర్చ్ ప్రముఖల భేటీ   
కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో క్రైస్తవులలో పలుకుబడి గల రెండు వర్గాలకు చెందిన ప్రతినిధులు సీనియర్ ఆర్ ఎస్ ఎస్ నాయకుడు ఒకరితో సమావేశం కావడం రాజకీయ వర్గాలలో ఆసక్తి కలిగిస్తున్నది. సుమారు 100 సంవత్సరాలుగా వివాదంగా ఉన్న ఒక ఆస్తి విషయమై పరిష్కారం కోసం వారు కలసిన్నట్లు చెబుతున్నారు. 

మలంకర ఆర్థోడాక్స్ సిరియన్ చర్చి, జాకోబైట్ సిరియన్ క్రిస్టియన్ చర్చికి చెందిన బిషప్‌లు,  ఇతర మతాధికారులు ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ  సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్ వైద్యను బుధవారం కొచ్చిలోని సంస్థ కార్యాలయంలో కలిశారు. సాధారణంగా ఆర్ ఎస్ ఎస్ కు దూరంగా ఉంటూ వస్తున్న క్రైస్తవ మత పెద్దలు తమ మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడం కోసం కలవడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. 

ఈ రెండు చర్చి లకు చెందిన మత పెద్దలు రెండు నెలల క్రితం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలసి ఈ వివాదం పరిష్కరింపమని కోరడం జరిగింది.  రెండు వర్గాల మధ్య శతాబ్దాల నాటి ఆస్తి వివాదానికి శాశ్వత పరిష్కారం కోసం వారు అన్వేషిస్తున్నారు. 

ఏప్రిల్ 6న కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ విషయంలో ఆర్ ఎస్ ఎస్ చొరవ తీసుకోవడం రాష్ట్ర రాజకీయాలపై తగు ప్రభావం చూపే అవకాశం ఉంది. రాష్ట్ర జనాభాలో 20 శాతంకు పైగా ఉన్న క్రైస్తవులు సాధారణంగా కాంగ్రెస్ మద్దతుదారులుగా ఉంటూ వస్తున్నారు. ఈ వివాదంకు పరిష్కారం చూపితే తాము బిజెపికి మద్దతు ప్రకటిస్తామని ఈ రెండు చర్చిల పెద్దలు హామీ ఇస్తున్నారు.

1,700 చర్చిలలో 1,064 మందిని ఆర్థడాక్స్ చర్చికి అప్పగించాలని జాకోబీయులను ఆదేశిస్తూ 2017 లో సుప్రీంకోర్టుతో తలెత్తిన వివాదం కారణంగా ఈ రెండు వర్గాల మధ్య తీవ్రమైన సమస్య ఏర్పడింది. జాకోబైట్లు  తాము చర్చిలను నిర్మించారని చెబుతున్నారు. సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ రాజకీయంగా శక్తివంతమైన వర్గం కావడంతో ఈ తీర్పు అమలుకు నిరాకరిస్తున్నారు.

ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపితే తమ చర్చ్ బిజెపికి మద్దతు ఇస్తుందని ఆర్ ఎస్ ఎస్ నేత వైద్యను కలిసిన వారిలో ఉన్న జాకబ్ సిరియన్ చర్చి  ధర్మకర్త ఫాదర్ స్లీబా పాల్ స్పష్టం చేశారు. పైగా ఈ విషయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డిఎఫ్ ప్రభుత్వం విఫలమైనదని, ప్రధాన ప్రతిపక్షమైన యూడీఎఫ్ తమను విస్మరించిందని విమర్శించారు.

తాము అధికారంలోకి వస్తే శబరిమలలో మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలకు మద్దతుగా చట్టం తీసుకు వస్తామని హామీ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ సమస్య గురించి ప్రస్తావించడం లేదని ఆయన మండిపడ్డారు. అందుకనే తమకు సహాయం చేస్తే బిజెపికి మద్దతు ఇవ్వడానికి సిద్ధమని స్పష్టం చేశారు.

కేరళ లోని క్రైస్తవ సమాజం యుడిఎఫ్‌కు పెద్దగా మద్దతు ఇస్తున్నప్పటికీ, ఇటీవల జరిగిన స్థానిక కౌన్సిల్ ఎన్నికలలో ఎల్‌డిఎఫ్ వైపు గణనీయమైన మొగ్గు చూపింది. దానితో ఈ సమావేశంతో ఖంగారు పడిన కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించినట్లు కనిపిస్తున్నది. 

రాష్ట్రంలోని ఎఐసిసి పరిశీలకులలో ఒకరైన ఇవాన్ డిసౌజా, కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లపల్లి రామచంద్రన్ హడావుడిగా
సిరో-మలంకర కాథలిక్ చర్చ్ మేజర్ ఆర్చ్ బిషప్ కార్డినల్ బసెలియోస్ క్లెమిస్‌ను కలిసి సమాలోచనలు జరిపారు. వారితో 
పాటు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకుడు పి.కె. కున్హాలికుట్టి కూడా ఉన్నారు.

ఇలా ఉండగా, కేరళ బిజెపి అధ్యక్షుడు కె. సురేంద్రన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పార్టీ పరిశీలకుడు సి.ఎన్. అశ్వత్ నారాయణ్ ఇటీవల మేజర్ ఆర్చ్ బిషప్ కార్డినల్ జార్జ్ అలాంచెరీని కలిశారు. ప్రస్తుత ఎన్నికలలో బిజెపి పలువురు క్రైస్తవ అభ్యర్థులను నిలబెట్టబోతున్నట్లు హామీ ఇచ్చిన్నట్లు నారాయణ్ తరువాత చెప్పాడు.