ఆరెస్సెస్‌ను ఎంత విమర్శిస్తే… అంతగా బలోపేతం!

ప్రతిపక్షాలు ప్రతిసారీ ఆరెస్సెస్ ఆరెస్సెస్ అంటూ విరుచుకుపడుతున్నాయని, వారు ఎంత విమర్శిస్తే ఆరెస్సెస్ అంత బలంగా తయారవుతుందని కర్ణాటక ముఖ్యమంత్రి బి ఎస్  యడియూరప్ప స్పష్టం చేశారు. ఆరెస్సెస్ కారణంగానే తాను ఈ స్థానంలో ఉన్నానని వెల్లడించారు. 
 
ప్రధాని నరేంద్ర  మోదీ కూడా తాను స్వయంసేవక్ అని చాలాసార్లు గర్వంగా చెప్పుకున్నారని గుర్తు చేశారు. కోవిడ్‌ను సమర్థవంతంగా అడ్డుకోగలిగిన మోదీ గురించి ప్రతిపక్షాలు అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు ప్రతిపక్షాలపై యడియూరప్ప విరుచుకుపడ్డారు.
 
అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆర్ఎస్ఎస్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడాన్ని ముఖ్యమంత్రి  తప్పుబట్టారు. ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేసే స్థాయి కాంగ్రెస్ పార్టీకి లేదని ధ్వజమెత్తారు. 
 ‘‘మీరంతా విపక్ష ఎమ్మెల్యేలు. అసెంబ్లీకి హాజరై… ప్రజల సంక్షేమం గూర్చి ఆలోచించాలి. చర్చించాలి. అంతేగానీ వ్యర్థమైన సమస్యల గురించి చర్చించకూడదు. రెండు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశాం. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అంతేగానీ చెత్త చెత్త సమస్యలను ప్రస్తావించకూడదు.’’ అని యడియూరప్ప హితవు చెప్పారు.