ఎన్నికల ప్రచారంలో రాహుల్ ను నిరోధించండి  

తమిళనాడు శాసన సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొనకుండా నిరోధించాలని ఎన్నికల కమిషన్‌ను బీజేపీ కోరింది. ఆయన ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించింది. మరొక స్వాతంత్య్ర పోరాటం చేయాలంటూ యువతను ఆయన రెచ్చగొడుతున్నారని, ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించాలని కోరింది.

బీజేపీ ఎలక్షన్ లయజన్ కమిటీ తమిళనాడు ఇన్‌ఛార్జి వీ బాలచంద్రన్ గురువారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) సత్యబ్రత సాహూకు ఓ వినతిపత్రం సమర్పించారు. మార్చి 1న కన్యాకుమారి జిల్లా, ములగుమూడులోని ఓ పాఠశాలలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేశారని ఆరోపించారు. ఆయన చేసిన ప్రసంగం పాఠశాల ప్రాంగణంలో ఎన్నికల ప్రచారంతో సమానమని పేర్కొన్నారు.

విద్యా సంస్థలో రాజకీయ ప్రచారం చేయడం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేయకుండా నిరోధించాలని కోరారు. 

రాహుల్ గాంధీ ఈ పాఠశాలలో మాట్లాడుతూ భారత దేశానికి ఇప్పుడు మరొక స్వాతంత్య్ర సంగ్రామం అవసరమని చెప్పారని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు ఐపీసీ సెక్షన్ 109 (పురిగొలిపినందుకు శిక్ష), సెక్షన్ 124ఏ (దేశద్రోహం) ప్రకారం నేరమని పేర్కొన్నారు. ఆయన దేశంలో ప్రస్తుత పరిస్థితులను బ్రిటిష్ పరిపాలనా కాలంతో పోల్చారని, మరొక స్వాతంత్య్ర పోరాటానికి యువతను రెచ్చగొట్టారని ఆరోపించారు. విద్వేషాన్ని పెంచడంతోపాటు, ప్రభుత్వంపై అసమ్మతిని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు.