12 తరగతి పుస్తకంలో ఔరంగజేబుపై పొగడ్తలు 

మొఘల్ పరిపాలకుడు ఔరంగజేబు గురించి చారిత్రక వాస్తవాలకు విరుద్ధంగా ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ పుస్తకాల్లో రాయడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే వాసుదేవ్ దేవ్నానీ  అభ్యంతరం వ్యక్తం చేశారు. ఔరంగజేబు గురించి వక్రీకరించి రాసిన భాగాలను ఈ పుస్తకాల నుంచి తొలగించాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాజస్థాన్ శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో వాసుదేవ్ మాట్లాడుతూ, ఔరంగజేబును కీర్తిస్తూ, చారిత్రక వాస్తవాలకు విరుద్ధంగా ఎన్‌సీఈఆర్‌టీ పన్నెండో తరగతి చరిత్ర  టెక్స్ట్ పుస్తకంలో రాయడం సరికాదని మండిపడ్డారు. ఈ భాగాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. యువ తరం చరిత్రకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకోవాలని, ఔరంగజేబు గురించి రాసిన తప్పుడు రాతలను తొలగించాలని కోరారు. 

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఆర్‌టీ) ప్రచురించిన 12వ తరగతి చరిత్ర టెక్స్ట్ పుస్తకంలోని ఓ భాగాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిలో హిందూ దేవాలయాల పునరుద్ధరణకు మొఘలు పరిపాలకుడు ఔరంగజేబు నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

 ‘‘ప్రార్థనా స్థలాల నిర్మాణం, నిర్వహణల కోసం మొఘలు చక్రవర్తులంతా నిధులు మంజూరు చేశారు. యుద్ధం సమయంలో దేవాలయాలు ధ్వంసమైతే, ఆ తర్వాత వాటి మరమ్మతు కోసం నిధులు మంజూరు చేశారు. షాజహాన్, ఔరంగజేబు పరిపాలనలో ఇది స్పష్టంగా వెల్లడవుతోంది. అయితే జిజియా పన్నును ముస్లింలు కానివారిపై ఔరంగజేబు పాలనలో మళ్లీ విధించారు’’ అని పేర్కొన్నారు. 

ఈ టెక్స్ట్ పుస్తకంలోని భాగాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో బాగా వైరల్ అవుతోంది. సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసినపుడు వచ్చిన సమాధానం ఎన్‌సీఈఆర్‌టీలోని చరిత్రకారుల డొల్లతనాన్ని బయటపెట్టింది. ఔరంగజేబు మతతత్వాన్ని సెక్యులరిజంగా ఎన్‌సీఈఆర్‌టీలోని చరిత్రకారులు ఈ పుస్తకంలో వర్ణించారని నెటిజన్లు మండిపడుతున్నారు.