అత్యంత నివాస యోగ్య నగరం బెంగళూరు

దేశంలోని మొత్తం 111 నగరాల్లో అత్యంత నివాస యోగ్య నగరంగా బెంగళూరు అగ్రస్థాననం సాధించింది. నగరాల్లో జీవనం సాగించడానికి అనుకూల పరిస్థితులను అధ్యయనం చేసి రూపొందించిన ఈజ్ ఆఫ్ లివింగ్ సూచీ జాబితాను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి విడుదల చేశారు.
బెంగళూరు తొలి ర్యాంకు దక్కించుకోగా, తరువాత టాప్ 10లో పుణె, అహ్మదాబాద్, చెన్నై , సూరత్, నవీముంబై, కోయంబత్తూర్, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబై ఉన్నాయి. 13 వ స్థానంలో ఢిల్లీ, 15 వ స్థానంలో విశాఖ, 24 వ స్థానంలో హైదరాబాద్ నిలిచింది.

జనాభా ఆధారంగా రెండుగా విభజించిన ఈ జాబితాలో పదిలక్షల మించి జనాభా కలిగిన 49 నగరాల్లో బెంగళూరు టాప్‌లో ఉండగా, ఢిల్లీ 13 వ స్థానంలో శ్రీనగర్ ఆఖరు స్థానంలో ఉన్నాయి. పది లక్షల కన్నా తక్కువ జనాభా కలిగిన 62 నగరాల్లో సిమ్లా టాప్‌లో ఉంది. ఈ కేటగిరిలో భువనేశ్వర్ రెండో స్థానం, సిల్వస్సా మూడో స్థానం దక్కించుకున్నాయి. 

కాకినాడ,సేలం, వెల్లూరు, గాంధీనగర్, గురుగ్రా, దావణగెరె, తిరుచిరాపల్లి టాప్ 10 ర్యాంకింగ్‌లు సాధించాయి. పది లక్షల జనాభా లోపు కేటగిరిలోని 62 నగరాల్లో ఢిల్లీ టాప్‌లో ఉండగా, ముజఫర్‌పూర్ ఆఖరి స్థానంలో నిలిచింది.

అత్యుత్తమ పురపాలికల జాబితాలో ఇండోర్ మున్సిపాలిటీ మొదటి స్థానం సంపాదించింది. క్లీన్ సిటీ అవార్డుతో పాటు పురపాలక రంగంలో పలు అవార్డులు సొంతం చేసుకున్న ఇండోర్.. తాజాగా విడుదల చేసిన జాబితాలో కూడా మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.

ఇండోర్ తర్వాతి స్థానాల్లో సూరత్, భోపాల్, పింప్రీ చించ్వాడ్, పూణె, అహ్మదాబాద్, రాయ్‌పూర్, గ్రేటర్ ముంబై, విశాఖపట్నం, వడోదర నగర మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవన్నీ మిలియన్ జనాభా దాటిన నగర మున్సిపాలిటీల జాబితా. 

ఇక మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణ మున్సిపాలిటీల్లో న్యూఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో తిరుపతి, గాంధీనగర్, కర్నాల్, సేలం, తిరుప్పూర్, బిలాస్‌పూర్, ఉదయ్‌పూర్, ఝాన్సీ, తిరుల్వేలి పట్టణాలు ఉన్నాయి.