తమిళ రాజకీయాల నుండి శశికళ నిష్క్రమణ!

మరో నెల రోజుల్లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న వేళ అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి  దివంగత జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ సంచలన రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు సంచలన ప్రకటన చేశారు.  ఈ మేరకు బుధవారం రాత్రి ఓ లేఖను విడుదల చేశారు. 

‘జయలలిత జీవించి ఉన్నప్పుడు అధికారం, హోదా కోసం నేనెప్పుడూ ఆరాటపడలేదు.  ఆమె మరణించిన తర్వాత కూడా అలాంటి పనులు చేయబోను. నేను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా. జయలలిత పార్టీ (అన్నాడీఎంకే) గెలువాలని ప్రార్థిస్తున్నా. ఆమె బంగారు పాలన, వారసత్వం ఇలాగే కొనసాగాలి. పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలి. ప్రధాన శత్రువు డీఎంకేను ఓడించాలి’ అని లేఖలో  ఆమెపేర్కొన్నారు. 

ఆమె ప్రకటనతో తమిళనాడులు ఆమె నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు వంటి కథనాలకు ముగింపు పలికింనట్లయింది. ఆమెను తిరిగి అధికారం పక్షంలోకి తీసుకొనేటట్లు చేయడం కోసం బిజెపి చేస్తున్న ప్రయత్నాలకు సహితం విరామం ఏర్పడింది. ఒక విధంగా రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితకు అవకాశం లేకుండా పోయింది. 

అక్రమాస్తుల కేసులో అరస్టైన శశికళ బెంగళూరు జైలు నుంచి ఇటీవలే విడుదలవడం తెలిసిందే. అంతకుముందు.. శశికళను తమ కూటమిలో చేర్చుకునే ప్రసక్తేలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ముఖ్యమంత్రి  పళనిస్వామిస్పష్టం చేసిన్నట్లు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. 

1991లో జయలలిత సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టడానికి ముందునుంచే అంటే 1980 నుంచే శశికళ ఆమెకు నమ్మకస్తురాలిగా మెలిగారు. 2016 డిసెంబర్‌లో జయలలిత మరణం తర్వాత ఆమె స్థానంలోకి రావాలని పలు ప్రయత్నాలు చేశారు. అయితే అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో 2017, ఫిబ్రవరిలో జైలుకు వెళ్లారు. 

జైలుకు వెళ్లే కంటే ముందే తన నమ్మకస్తుడు, అన్నాడీఎంకే నేత కే పళనిస్వామిని సీఎంగా ఎంపిక చేశారు. ఆ తర్వాత జైలుకు వెళ్లారు. కొద్ది రోజుల్లోనే  అన్నాడీఎంకే పార్టీ.. పళనిస్వామి, పన్నీర్‌ సెల్వమ్‌ నేతృత్వంలో రెండు వర్గాలుగా చీలిపోయింది. బీజేపీ సంప్రదింపులతో ఇరువర్గాల మధ్య విభేదాలు సద్దుమణిగి పళనిస్వామి సీఎంగా, పన్నీర్‌ సెల్వం డిప్యూటీ సీఎంగా పదవులు చేపట్టారు. వారిద్దరూ కలసి శశికళను పార్టీ నుంచి బహిష్కరించి సుస్థిరమైన ప్రభుత్వం అందించారు. 

అయితే ఆమె జైలు నుండి రాగానే తిరిగి అన్నాడీఎంకే నాయకత్వం పదవి కోసం ఎత్తుగడలు వేస్తారని,  ఆ పార్టీలో చీలిక తెస్తారని పలు కధనాలు వెలువడ్డాయి. అయితే అటువంటి అవకాశాలు కనిపించక పోవడంతో ఆమెకు ప్రస్తుతంకు మౌనంగా ఉండడం తప్ప మార్గాంతరం లేకపోయింది.