బిజెపి బెంగాల్ మూలాలున్న పార్టీయే … గడ్కరీ 

బిజెపి `బయటివారి పార్టీ’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ చేస్తున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొట్టిపారవేసారు. బిజెపి మూలాలు బెంగాల్ లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. 

జనసంఘ్ నుంచే బీజేపీ పుట్టిందని, దాని స్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని గడ్కరీ గుర్తు చేశారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ బెంగాల్‌లో పుట్టారని, అలాంటపుడు బీజేపీ అవుట్ సైడర్స్ పార్టీ ఎలా అవుతుందో వివరించాలని ఆయన ప్రశ్నించారు. 

కోల్‌కతా ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ  జాయ్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొంటూ బెంగాల్ ఎన్నికలు ప్రజల భవితవ్యాన్ని నిర్ణయించే ఎన్నికలని చెప్పారు. అంతే తప్ప బీజేపీ, తృణమూల్, సీపీఎం భవితవ్యాన్ని నిర్ణయించే ఎన్నికలు ఎంతమాత్రమూ కావని స్పష్టం చేశారు. 

బెంగాల్ ముఖ చిత్రాన్ని మార్చడానికే తాము ప్రయత్నిస్తున్నామని గడ్కరీ తెలిపారు. ఇలా బెంగాల్ ముఖ చిత్రాన్ని మార్చేసి, ప్రపంచంలోనే భారత్‌ను ఉన్నత స్థానంలో నిలపాలన్నది తమ భావన అని ఆయన ప్రకటించారు. సమయం వచ్చినప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది తాము ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

అయితే బెంగాలీకి చెందిన వ్యక్తే సీఎం కుర్చీలో కూర్చుంటారని గడ్కరీ తెలిపారు. మమత పాలనతో బెంగాలీలు విసిగిపోయారని, అందుకే బీజేపీ పాలనను కోరుకుంటున్నారని గడ్కరీ చెప్పారు. పశ్చిమ బెంగాల్ లో మార్పు తధ్యమని చెబుతూ ఇక్కడ బిజెపి విజయాన్ని ఎవ్వరు అడ్డుకోలేరని గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. మే 4న బిజెపి వ్యక్తి ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని భరోసా వ్యక్తం చేశారు.