ఒక పక్క దివాళా … మరో పక్క పోర్టులను నిర్మిస్తారా!

పోర్టులను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని మారిటైమ్ ఇండియా సదస్సులో ముఖ్యమంత్రి వై ఎస్  జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన వెనుక గల చిదంబర రహస్యం ఏమిటని  నర్సాపురం ఎంపీ రఘురామ రాజు   ప్రశ్నించారు. ‘‘ఓ పక్క దివాళా… మరోపక్క అప్పులు… అలాంటిది మూడు పోర్టులు కడతానంటున్నారు. దానికోసం మళ్లీ అప్పులు చేయాలి. ఆ అప్పులలో కొంత డబ్బును మళ్లీ సంక్షేమ పథకాలకు వాడాలని చూస్తున్నారు”  అంటూ ఎద్దేవా చేశారు. 

“ఉన్నది నాలుగు పోర్టులు.. అప్పులు పెరుగుతున్నాయి. ఆదాయం తగ్గుతోంది. జీడీపీ తక్కువగా ఉంది. ఎవడూ రాడనే కదా… మీరు కట్టేది. వ్యాపారస్తుడు రానప్పుడు.. తగుదునమ్మా అంటూ మనం ఎందుకు వెళ్లాలి. ప్రజలు ధైర్యం లేక మాట్లాడలేకపోతున్నారు. అడిగితే పోలీసుల కేసులతో భయపెడుతున్నారు’’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.  

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులతో ఏపీ దివాలా ఆంధ్ర ప్రదేశ్‌గా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనన్ని అప్పులు ఏపీ చేసిందని చెబుతూ అప్పుల్లో ప్రథమ స్థానంలో ఆంధ్రా వుందని చెప్పారు.  ద్రవ్య లోటు మరీ దరిద్రంగా మారిందని పేర్కొన్నారు. 

అసలే అప్పుల్లో ఆంధ్ర రాష్ట్రం.. పైగా పోర్టుల నిర్మాణం అవసరమా? అని నిలదీశారు.  కొత్తగా మూడు పోర్టులు కట్టాలంటే ఇంకెంత అప్పు చెయాలి? రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఎన్ని కోట్లు కావాలి? వాటికోసం ఇంకేం అమ్ముతారు? అనుభవం లేని మందుల కంపెనీకి పోర్టుల నిర్మాణ కాంట్రాక్టు ఇస్తే ఎలా?  అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

ఇప్పటికే ఉన్న పోర్టులకు వ్యాపారం లేక ఉసూరుమంటూ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం అప్పుచేసి కొత్త పోర్టుల నిర్మాణం అవసరమా? ఆ బాకీలు ఎవరు తీర్చాలి? అంటూ రఘురామరాజు జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 

ఉన్న హాస్పిటల్స్ మెరుగు పరచకుండా కొత్త హాస్పిటల్స్ కడతామని హమీలెందుకు? ఓట్లేయకుంటే పెన్షన్స్ కట్ చేస్తున్నారు. డబ్బే ఉంటే పోలవరం, రాయలసీమ పెండింగు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయండి అంటూ హితవు పలికారు.