తెలుగు రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయాయి. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో బహిర్గతమైంది. బహిరంగ మార్కెట్ నుంచి అప్పులు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంటే, తెలంగాణ 6వ స్థానంలో ఉంది.
ఆర్‌బిఐ వెల్లడించిన ప్రకారం 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెల వరకు ఎపి రూ.44,250 కోట్లు, తెలంగాణ రూ.36,354 కోట్ల రుణాలను తీసుకున్నాయి. అప్పులను తీసుకోవడంలో ఎపి కంటే ముందు వరుసలో మహారాష్ట్ర, తమిళనాడు నిలిచాయి. మహారాష్ట్ర రూ.65,000 కోట్లు, తమిళనాడు రూ.63,000 మేర అప్పులు ఉన్నాయి.
డిసెంబర్ నెల మొత్తం జగన్ సర్కార్ స్పెషల్ డ్రాయింగ్ సౌకర్యం, 26 రోజుల పాటు చేబదుళ్లు, మూడు రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంది. ఇక తెలంగాణా కూడా అప్పులు తీసుకోవడంలో ఎపికి తీసిపోలేదు. 28 రోజుల పాటు స్పెషల్ డ్రాయింగ్ సౌకర్యం, 20 రోజుల పాటు చేబదుళ్లు, 13 రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని వినియోగించుకుంది.
నెలవారీగా బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకున్నాక కూడా రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీరకపోతే ప్రభుత్వాలు ఈ మూడింటిలో ఏదో ఒక సౌకర్యాన్ని వాడుకుని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతుంటాయి. అలా కాకుండా మూడింటిని ఒకదాని తర్వాత ఒకటి వాడుకోవడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక ఇబ్బందుల తీవ్రతకు అద్దం పడుతుంది.
ఇప్పటికే అర్థిక ఇబ్బందులకు తోడు కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రాలు మరింత అప్పులు ఊబిలో కూరుకుపోయాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు 29 రాష్ట్రాలు కలిపి బహిరంగ మార్కెట్ నుంచి రూ.5,55,852 కోట్ల అప్పు చేశాయి.
డిసెంబర్ నాటికి జగన్ ప్రభుత్వం గత ఏడాది 12 నెలల్లో తీసుకున్నదానికంటే 4.3 శాతం అధికంగా అప్పు చేయగా, కెసిఆర్ ప్రభుత్వం గత సంవత్సరం తీసుకున్న దానిలోంచి 98.45శాతం మొత్తాన్ని తీసుకుంది.
తెలుగు రాష్ట్రాల రుణాలు (కోట్లల్లో)
2018-19 ఎపి 30,200 కోట్లు…..తెలంగాణ 26,740 కోట్లు
2019-20 ఎపి 42,415 కోట్లు….. తెలంగాణ 37,109 కోట్లు
2020-21 (డిసెంబర్ నాటికి) ఎపి 44,250 కోట్లు…..తెలంగాణ 36,534 కోట్లు.
More Stories
హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అద్భుత విజయం
జమ్ముకశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్ అబ్దుల్లా
పోలవరంకు కేంద్రం రూ.2,800 కోట్లు విడుదల