ఉద్యోగ భద్రతకై సీఎం జగన్ ఇంటి ముట్టడి యత్నం 

కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి కోవిడ్‌ బాధితులకు సేవలందించామని, అర్ధాంతరంగా తమను విధుల నుంచి తొలగించడం ఘోరమని, ఇప్పటికైనా ఉద్యోగ భద్రత కల్పించాలని  ఆంధ్ర ప్రదేశ్ లో పారా మెడికల్‌ సిబ్బంది డిమాండ్‌ చేశారు. 

కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పదివేలకు పైగా వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించింది. జనవరి తరువాత కరోనా తీవ్రత తగ్గడంతో వారందరినీ విధుల నుంచి తొలగించింది.  సుమారు వెయ్యిమంది పారా మెడికల్‌ సిబ్బంది తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వై ఎస్  జగన్మోహన్‌రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు.

కుంచనపల్లి కూడలి మీదుగా కట్టవైపు కొంతమంది రాగా, మరికొంతమంది తాడేపల్లి పెట్రోలు బంకు మీదుగా సిఎం ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. అప్పటికే సిద్ధంగా ఉన్న పోలీసులు వారందరినీ అరెస్టు చేసి తాడేపల్లి, మంగళగిరి పోలీసు స్టేషన్లకు తరలించారు. 

ఈ సందర్భంగా ఎపి స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ జెఎసి చైర్మన్‌ ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ సిఎం దృష్టికి సమస్యలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన సిబ్బందిని అక్రమంగా అరెస్టు సిగ్గుచేటని విమర్శించారు. పనిచేసిన ఆరు నెలల్లో రెండు నెలలే వేతనాలు ఇచ్చారని వాపోయారు. 

ప్రయివేటు ఆసుపత్రుల్లో వేలాది రూపాయల జీతాలు వదులుకుని వచ్చిన తమను ముందస్తు సమాచారం లేకుండా తొలగించడం దారుణమని విమర్శించారు. అక్రమ అరెస్టులకు నిరసనగా  పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు.