రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు నిరసన!

రేణిగుంట విమానాశ్రయం లాంజ్ నుంచి బయటకు వెళ్లనియ్యకుండా మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత ఎన్  చంద్రబాబు నాయుడును పోలీసులు అడ్డుకోవడంతో సోమవారం అంతా హైడ్రామా కొనసాగింది. ఆయనకు చిత్తూర్ జిల్లా అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. చంద్రబాబు ఎయిర్ పోర్టులోనే నేలపై భైఠాయించి నిరసన తెలిపారు. 

తన పర్యటనను అడ్డుకోవడం పట్ల జిల్లా కలెక్టర్, తిరుపతి అర్బన్ ఎస్పీలను కల్సి నిరసన తెలుపుతానని చెప్పినా ఆయనను వెళ్లనీయలేదు. వారిద్దరిని అక్కడికే పిలిపిస్తామని చెప్పినా ఆయన ఒప్పుకోలేదు.  తానేం అంత గొప్ప వ్యక్తిని కాదని.. తనకు తానుగా అక్కడికి వెళతానని ఆయన పట్టుబట్టారు? 

తనదగ్గరకే పిలిపిస్తామని చెప్పడాన్ని ఆయన తోసిపుచ్చారు. ప్రపంచానికి ప్రభుత్వం చేసే అరాచకాలు తెలియాల్సిందేనని స్పష్టం చేశారు. మీడియాతో కూడా మాట్లాడించకపోవడాన్ని కూడా ప్రశ్నించారు. ‘‘నేనేమైనా హత్య చేయడానికి వెళుతున్నానా.. 14 ఏళ్లు సీఎంగా ఉన్నాను. ప్రతిపక్ష నేతను నేను. నన్నెందుకు  నిర్బంధించారో చెప్పండి’’ అంటూ పోలీసులను నిలదీశారు. 

 చిత్తూరు నగరపాలక సంస్థలో కార్పొరేటర్‌ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచేందుకు సోమవారం జిల్లా పర్యటనకు వచ్చారు. అభ్యర్థులకు వస్తున్న బెదిరింపులకు నిరసనగా ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు నగరంలోని గాంధీ కూడలి వద్ద ధర్నా చేయాల్సి ఉంది. 

అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు బయల్దేరి పుత్తూరు మీదుగానే తిరుపతి చేరుకొని, సాయంత్రం 5.45 గంటలకు తిరుపతిలో జరిగిన అరాచక పర్వంపైనా ఆర్టీసీ బస్టాండు సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలపాల్సి ఉంది. తర్వాత ఆటోనగర్‌లోని పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రి 7.15 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ వెళ్ళవలసి ఉంది.

విమానాశ్రయం నుంచి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును బలవంతంగా తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ట్రూజెట్, ఇండిగో, స్పైస్ జెట్ విమానాల్లో చంద్రబాబుకు టికెట్లు బుక్ చేశారు. అయితే చంద్రబాబు మాత్రం తన నిరసన దీక్షను కొనసాగించారు. పోలీసుల తీరును తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన.. వెనక్కి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు.  ఆయన నేలపై కూర్చుని, మంచి నీళ్లు కూడా తాగకుండా తన నిరసన తెలిపారు. 

కాగా, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నదుననే చంద్రబాబు నాయుడు పర్యటనకు అనుమతి ఇవ్వలేదని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా టిడిపి నిరసనను అనుమతిపలేదని ఆయన చెప్పారు. ఈ విషయమై గత రాత్రే పోలీసులకు నోటీసు ఇచ్చామని తెలిపారు.