`హెచ్‌-1బి’ వీసాల నిషేధంపై ఎటూ తేల్చని బైడెన్

కొత్త హెచ్‌-1బి వీసాల జారీపై ట్రంప్‌ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తొలగించడంపై ఇంకా ఏమీ నిర్ణయించలేదని బైడెన్‌ ప్రభుత్వం తెలిపింది. హెచ్‌-1బి వీసాలపై మార్చి 31వరకు నిషేధాన్ని పొడిగిస్తూ జనవరిలో ట్రంప్‌ ఉత్తర్వులు జారీచేశారు. దేశంలో నిరుద్యోగం రేటు ఎక్కువగా వున్నందున, మరింతమంది విదేశీయులను భరించే పరిస్థితి లేదని ట్రంప్‌ అప్పట్లో పేర్కొన్నారు. 

అయితే ట్రంప్‌ పలు అంశాలపై జారీ చేసిన పలు ఉత్తర్వులను కొట్టేసిన బైడెన్‌  హెచ్‌-1బి వీసాల జారీపై విధించిన నిషేధంపై ఇంకా చర్యలు తీసుకోలేదు. బైడెన్‌ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేయకపోతే ఈ నెల ఆఖరితో ఆ నిషేధం ముగుస్తుంది. ఈ ప్రశ్నపై తాను ఇప్పుడే నిర్దిష్టమైన సమాధానం చెప్పలేనని హోంమంత్రి అలేజాండ్రో మయోర్కాస్‌ పత్రికా సమావేశంలో తెలిపారు. 

తాము ప్రాధాన్యమనుకున్న పనులను సరిగా నిర్వహించడానికే చాలా సమయం వెచ్చించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. కాగా, విడిపోయిన వలస కుటుంబాలు తిరిగి అమెరికాలో లేదా వారి స్వదేశంలో కలిసేందుకు అనుమతించాలని బైడెన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఆ కుటుంబాలు అమెరికాలో కలవాలని భావించినట్లైతే వారు అమెరికాలోనే వుండేందుకు గల చట్టబద్ధమైన అవకాశాలను తాము పరిశీలిస్తామని, ఆ కుటుంబాల అవసరాలను తీరుస్తామని హోంమంత్రి చెప్పారు.

ఇందుకు గానూ ఒక టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా బైడెన్‌ ఆదేశాలు జారీ చేశారు. 2018లో ట్రంప్‌ విధానాల వల్ల దాదాపు 2,800 వలస కుటుంబాలు విడిపోయాయి. ఇప్పటివరకు 105 కుటుంబాలను బైడెన్‌ ప్రభుత్వం కలిపింది. కానీ ఇంకా 550 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కలుసుకోవాల్సి వుంది.