అవినీతి కేసులో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి జైలు శిక్ష 

ఒక అవినీతి కేసులో ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు నికొలస్‌ సర్కోజిని పారిస్‌ కోర్టు దోషిగా నిర్ధారించింది. మూడేళ్లు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఫ్రాన్స్‌కు 2007 నుండి 2012 వరకు అధ్యక్షుడిగా వున్న సర్కోజి సీనియర్‌ మేజిస్ట్రేట్‌ నుండి అక్రమంగా సమాచారం సేకరించే ప్రయత్నం చేసినందుకు కోర్టు ఆయన్ని దోషిగా నిర్ధారించింది.
 
ఆర్థిక విషయాలపై కోర్టులో ఉన్న సమాచారాన్ని అందించేందుకు బదులుగా మొనాకోకు చెందిన న్యాయమూర్తి గిల్బర్ట్ అజిబర్ట్‌కి పదోన్నతి కల్పించారన్న ఆరోపణల నేపథ్యంలో సర్కోజీకి ఈ శిక్ష పడింది. సర్కోజీపై ఆరోపణలతో ఏకీభవించిన ఫ్రెంచ్‌ న్యాయస్థానం   అతన్ని దోషిగా తేల్చింది.  సర్కోజీకి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించినప్పటికీ.. ఆ దేశ నిబంధనల ఏడాది మాత్రమే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్‌ బ్రేస్‌లెట్‌ పెట్టుకుని సర్కోజి తన నివాసానికే పరిమితం కావాలని కోర్టు ఆదేశించింది.
 
సర్కోజితో పాటు వున్న మరో ఇద్దరిని కూడా దోషిగా నిర్ధారించిన కోర్టు వారికి కూడా ఇదే శిక్షను విధించింది. ఈ తీర్పుపై అపీల్‌ చేసుకునేందుకు ఆయనకు కోర్టు పది రోజుల గడువు ఇచ్చింది. కాగా, ఈ నెలలోనే మరో కేసులో సర్కోజీ విచారణను ఎదుర్కొనాల్సి వుంది. 2012 అధ్యక్ష ఎన్నికల్లో అక్రమంగా నిధులు సమకూర్చారన్న ఆరోపణలపై మరో 13తోపాటు సర్కోజీ కూడా విచారణకు సిద్దమయ్యారు.