మయన్మార్‌లో నిరసనకారులపై కాల్పుల్లో 18 మంది మృతి 

మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం సైనిక కుట్రకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి ఆదివారం భద్రతా బలగాలు హింసకు దిగారు. రాజధాని యాంగూన్‌ సహా పలు నగరాల్లో జలఫిరంగులు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగంతో పాటు కాల్పుల ఘటనలు చోటుచేసుకొన్నాయి.

కాల్పుల్లో  18 మంది నిరసనకారులు చనిపోయినట్టు సమాచారం ఉందని ఐరాస మానవహక్కుల కార్యాలయం పేర్కొన్నది. ఫిబ్రవరి 1న మయన్మార్‌లోని ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేసి, మిలిటరీ అధికారం చేపట్టిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందనేది పారదర్శకంగా వెల్లడికాని పరిస్థితి. ఆదివారం భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య మరింత అధికంగా ఉన్నట్టు భావిస్తున్నారు.

ఆదివారానికి ముందు ఆ దేశంలో 8మంది నిరసనకారులు మృతి చెందినట్టు నిర్ధారణ అయింది. మరోవైపు వందలాదిమంది నిరసనకారులను మిలిటరీ ప్రభుత్వం అదుపులోకి తీసుకున్నది. ఆదివారం యాంగోన్‌లో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగుల్ని ప్రయోగించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాల్పుల్లో చనిపోయిన ఓ యువకుడి ఫోటో కూడా అందులో ఉన్నది.

కొన్ని చోట్ల నిరసనకారులను తరుముతున్న పోలీసులకు అడ్డంగా స్థానికులు బారికేడ్లను ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. భద్రతా దళాలపై జల ఫిరంగులు, బాష్పవాయు గోళాలతో నిరసనకారులు తిరగబడినట్టు తెలిపే ఫోటోలు కూడా ఉన్నాయి. మొదట యాంగోన్‌లోని వైద్య విద్యార్థులు నగరంలోని ప్రధాన కూడలిలో నిరసన ప్రదర్శనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా దళాలు జలఫిరంగులు, బాష్పవాయి గోళాలను ప్రయోగించాయి.

దాంతో, భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. యాంగోన్‌లో పోలీసుల కాల్పుల శబ్దాలు, నిరసన గుంపులపై గ్రెనేడ్లు విసరగా విడుదలైన దట్టమైన పొగకు సంబంధించిన వార్తలు కూడా వెల్లడయ్యాయి. దవేయిలో నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. 

శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిపై నేరుగా కాల్పులు జరపడం ఆమోదయోగ్యం కాదని న్యూయార్క్ కేంద్రంగా పని చేసే హ్యూమెన్ రైట్స్ వాచ్ ఆసియా డిప్యూటీ డైరెక్టర్ ఫిల్‌రాబర్ట్‌సన్ స్పష్టం చేశారు. మయన్మార్‌లోని సైనిక  ప్రభుత్వ హింసాత్మక చర్యలను ప్రపంచం గమనిస్తోందని ఆయన హెచ్చరించారు.