త్వరలో జీఎస్‌టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు?

దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నిరోజు, రోజుకు పెరుగుతూ ఉండడంతో అన్ని వర్గాల ప్రజలలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది. చివరకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ సహితం ఆందోళన ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను తగ్గించాడనికి అవగాహనకు రావలసిందే అని ఆలయం స్పష్టం చేసారు. 
 
ఈ ధరలు తగ్గించడానికి  పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి చేర్చడం మాత్రమే మార్గమని దాదాపు అందరూ భావిస్తున్నారు. అయితే ఆ విధంగా చేయడం వల్లన తాము ఆదాయం కోల్పోవలసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాలు విముఖత వ్యక్తం చేస్తూ ఉండడంతో కేంద్రం ముందడుగు వేయలేక పోతున్నది. 
 
స్వయంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయం చెప్పారు. తాను దాదాపు ప్రతి సమావేశంలో ఈ ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకు రావాలని చెబుతున్నా రాష్ట్రాలు ముందుకు రావడం లేదని వాపోయారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని గత వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ఆయన కోరారు.
 
పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల రాజకీయంగా కూడా పెను ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో ధరల తగ్గింపుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తున్నది. అందుకనే వీటిని త్వరలో జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం కోసం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయమై కేంద్ర ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రహ్మణియన్ స్పష్టమైన సంకేతం ఇచ్చారు. 
ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ (మహిళా విభాగం) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సుబ్రహ్మణియన్ మాట్లాడుతూ  పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనకు తాను మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అయితే దీనిపై నిర్ణయం జీఎస్‌టీ కౌన్సిల్‌ మాత్రమే తీసుకుంటుందని చెప్పారు. `పెట్రోలియం ఉత్పత్తులను వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ)పరిధిలోకి తీసుకురావడం మంచి ప్రతిపాదన. అయితే, దీనిపై నిర్ణయాధికారం మాత్రం జీఎస్‌టీ కౌన్సిల్‌దే’ అని కేవీ సుబ్రమణియన్‌ అన్నారు. ఆహార ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు పెరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలో.. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ అన్నారు. కొవిడ్‌-19 వల్ల గత ఏడాది ఏప్రిల్‌లో చమురు ఉత్పత్తి సంస్థలన్నీ ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించాయని.. ఇప్పుడు చమురుకు డిమాండ్‌ పెరగడం, ఉత్పత్తి తక్కువగా ఉండడంతో ధరలు పెరుగుతున్నాయని ఆయన వివరించారు. ఉత్పత్తిని పెంచాల్సిందిగా ఆయా దేశాలపై తాము ఒత్తిడి తెస్తున్నామని వెల్లడించారు. చమురు దేశాలు ఉత్పత్తిని పెంచితే డిమాండ్‌, దాంతోపాటే ధర తగ్గి దేశంలో కూడా పెట్రో ధరలు తగ్గుతాయని చెప్పారు.