`పిఎం కిసాన్’ అక్రమ లబ్ధిదారుల నుండి రికవరీ 

పిఎం కిసాన్‌ పథకం నిబంధనలను, మార్గదర్శకాలను ఉల్లంఘించి లబ్ధి పొందినట్లు గుర్తించిన రైతుల నుంచి ఇప్పటి వరకు లబ్ధి చేకూరిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. అనర్హులుగా నిర్ధారించిన వారందరి నుంచి సొమ్ము రికవరీ చేసి స్కీం అమలుపై ఇప్పటికే పేర్కొన్న స్టాండర్డ్‌ ఆపరేషనల్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఒపి) ప్రకారం సర్కారుకు డిపాజిట్‌ చేయాలని తెలిపింది. 
 
పిఎం కిసాన్‌ నిబంధనల అమల్లో భాగంగా ఇప్పటికే అర్హత సాధించి లబ్ధి పొందుతున్న రైతుల్లో అనర్హులను గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరింది. మొత్తం లబ్ధిదారుల్లో ఐదు శాతం మందిని రాండమ్‌గా ఎంపిక చేసి భౌతిక తనిఖీలను మార్చి నెలాఖరులోపు పూర్తి చేసి నివేదికలు పంపాలంది. గ్రామ పంచాయతీల్లో లబ్ధిదారుల జాబితాలను తక్షణం ప్రకటించాలని, ఫిర్యాదుల పక్షోత్సవాన్ని ఫిబ్రవరిలోనే నిర్వహించాలంది.

రైతులు తమకు తాముగా పిఎం కిసాన్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకున్న కేసుల్లో అధికంగా అనర్హులున్నారని ఇప్పటికే గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. అందుకే సెల్ఫ్‌ రిజిస్ట్రేషన్లపై నిఘా పెట్టాలని కేంద్రం ఆదేశించింది. సెల్ఫ్‌ రిజిస్ట్రేషన్లను మరొకసారి తనిఖీ చేయాలని కోరింది. 

 
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖలో పిఎం కిసాన్‌ను పర్యవేక్షిస్తున్న ఉన్నతస్థాయి అధికారులు ఇటీవల రాష్ట్రాల నోడల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా, దానిలో ఇచ్చిన ఆదేశాల మేరకు లబ్ధిదారుల తనిఖీపై రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యాచరణ రూపొందించి ముమ్మరంగా అమలు చేస్తోంది.ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో లక్ష మంది ‘అనర్హులు’న్నారని, వారి నుంచి తీసుకున్న సొమ్ము రాబట్టాలనగా, ప్రత్యేక తనిఖీల్లో ‘అనర్హుల’ సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.