అనాది కాలం నుండే భారత్ లో ప్రజాస్వామ్యం 

భారత్ లో ప్రజాస్వామ్య వ్యవస్థ అన్నది ఐరోపా దేశాల నుండి దిగుమతి చేసుకున్నదని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇతరులు కలలో కూడా అటువంటి భావనకు రాకముందే భారత దేశంలో ప్రజాస్వామ్యం నెలకొన్నదని మాజీ ప్రధాన  మొరార్జీ దేశాయ్ చెప్పారు. 
 
ఆయన 125వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన మనవడు మధుకేశ్వర్ దేశాయ్ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఆయనతో జరిపిన ఒక వీడియో క్లిప్ లో ప్రపంచంలో అతి పురాతనమైన ప్రజాస్వామ్య వ్యవస్థ భారత్ ది అని ఈ గాంధేయవాది స్పష్టం చేశారు. 
 
“భారతదేశానికి ఒక శక్తి, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంది” ఇది భారతదేశం వెలుపల ప్రజలకు ఈ విషయం తెలియకపోవచ్చు.   “భారతదేశంలో కూడా, కొంతమంది అలా అనుకుంటున్నారు.  ఎందుకంటే భారతదేశంలో కూడా, భారత దేశం గురించి  తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు. అది పాశ్చాత్య ప్రభావం ఫలితం” అని మాజీ ప్రధాని ఆ ఇంటర్వ్యూ లో చెప్పారు.

“ఇతర దేశాల కంటే భారతదేశానికి ప్రజాస్వామ్యం సహజమని ప్రజలు మర్చిపోతున్నారు.  ఎందుకంటే ప్రపంచంలో మరే దేశమూ దాని గురించి కలలు కానక ముందే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ఇది పూర్తిగా , ధృడంగా వేదాలలో కూడా వర్ణించబడి ఉంది” అని మొరార్జీ స్పష్టం చేశారు. 


చాలా మంది బ్రిటీష్ ప్రజలు భారతదేశానికి ప్రజాస్వామ్యం తమ బహుమతిగా భవిస్తూ ఉంటారని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి చెప్పగా, , “ఇది వారికి సంతోషం కలిగిస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.   కానీ మన దేశంలో ఎప్పుడో 2,500 సంవత్సరాల క్రితమే  పూర్తిగా ఎన్నికైన రిపబ్లిక్లులు ఉన్నాయి. అప్పటికి  గ్రీస్ కూడా దేశ తరహా ప్రజాస్వామ్యం లేదు” అని మొరార్జీ సమాధానం ఇచ్చారు.

1977 సార్వత్రిక ఎన్నికల తరువాత పార్లమెంటులో జనతా పార్టీ నాయకుడిగా ఎన్నికైన తరువాత మొరార్జీ దేశాయ్ జీవిత కాలం కాంగ్రెస్ లో కొనసాగినా భారతదేశపు మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అయ్యారు. అతను మార్చి 24, 1977 నుండి జూలై 28, 1979 వరకు ప్రధానిగా వ్యవహరించారు.

దేశాయ్ 1969 నుండి ఇందిరా గాంధీ మంత్రివర్గంలో ఉప ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అనంతరం దేశాయ్ కూడా ఉప ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అదే సంవత్సరంలో కాంగ్రెస్ నుండి  విడిపోయినప్పుడు, ఇందిరా గాంధీ నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ (రూలింగ్) కు వ్యతిరేకంగా దేశాయ్ భారత జాతీయ కాంగ్రెస్  (ఆర్గనైజేషన్) లో కీలక నేతగా వ్యవహరించారు.

అత్యవసర సమయంలో ఆయన జైలు పాలయ్యారు. ఆదివారం మొరార్జీ  125 వ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తూ, “మాజీ ప్రధాని శ్రీ మొరార్జిభాయ్ దేశాయ్‌ తన సుదీర్ఘ ప్రజా సేవలో భారతదేశం యొక్క అభివృద్ధి కోసం అవిరామంగా పనిచేశాడు.ఆయన నిష్కళంకమైన చిత్తశుద్ధికి, ప్రజాస్వామ్యం పట్ల అచంచలమైన నిబద్ధతకు ప్రసిద్ది చెందాడు ” అంటూ నివాళులు అర్పించారు.

ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు ట్వీట్ చేస్తూ, “మాజీ ప్రధాని శ్రీ మొరార్జీ దేశాయ్‌కి నా వినయపూర్వకమైన నివాళులు. ఆయన  నిజమైన గాంధేయవాది, అతను నమ్మిన సూత్రాలపై ఎప్పుడూ రాజీపడలేదు.  గొప్ప నిర్వాహకుడు.  కఠినమైన క్రమశిక్షణా,  అవినీతి నిరోధక క్రూసేడర్. శ్రీ దేశాయ్ సరళమైన జీవనం, ఉన్నత ఆలోచనను విశ్వసించారు. దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషికి ఆయన ఎప్పుడూ గుర్తుండిపోతారు. ” అని పేర్కొన్నారు.