కరోనా టీకా వేయించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి జి కిష‌న్ రెడ్డి మంగళవారం ఉదయం టీకా వేయించుకున్నారు.  హైద‌రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో  ఆయ‌న తొలి డోసు టీకా తీసుకున్నారు. భార‌త్‌బ‌యోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ టీకాను కిషన్ రెడ్డి వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా పాల్గొన్నారు.
 
ఇలా ఉండగా, కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి కూడా ఇవాళ ఢిల్లీలోని హార్ట్ అండ్ లంగ్ ఇన్స్‌టిట్యూట్‌లో తొలి డోసు కోవిడ్ టీకా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీ కే కేశ‌వ రావు  హైద‌రాబాద్‌లోని ఓ హాస్పిట‌ల్‌లో ఆయ‌న తొలి డోసు టీకా వేయించుకున్నారు.  
 
 ఇక శ్రీన‌గ‌ర్‌లో జ‌మ్మూక‌శ్మీర్ నేత‌, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ఎంపీ ఫారూక్ అబ్దుల్లా టీకా తీసుకున్నారు.  షేర్ ఏ క‌శ్మీర్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్ కాలేజీలో ఆయ‌న తొలి డోసు టీకా వేయించుకున్నారు.   60 ఏళ్లు దాటిన వారికి దేశ‌వ్యాప్తంగా ఉచిత టీకా పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో  దీర్ఘ‌కాల వ్యాధులు ఉన్న 45 ఏళ్లు దాటిన వారికి కూడా టీకా వేస్తున్నారు. కోవిన్ పోర్ట‌ల్‌లో రిజిస్ట‌ర్ చేసుకున్న వారికి ప్ర‌భుత్వ ఆసుపత్రుల్లో టీకాలు వేస్తున్నారు.