కేసీఆర్‌.. నువ్వుకూడా జైలుకే వెళ్తావ్

కేసీఆర్‌.. నువ్వు కూడా జైలుకే వెళ్తావ్ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వద్ద బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా సందర్భంగా అరెస్ట్  చేసిన బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్‌ను పోలీసులు వెంటనే విడుదల చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.
 
భానును విడుదల చేయాలనేది తమ రిక్వెస్ట్ కాదని వార్నింగ్ అని సంజయ్ హెచ్చరించారు. భాను అరెస్ట్ విషయంలో ఐజీ ప్రభాకర్‌కు సిగ్గుండాలని సంజయ్ మండిపడ్డారు. లాలూ, కరుణానిధికి ఏం జరిగిందో కేసీఆర్‌ గుర్తుచేసుకోవాలని ఆయన హితవు పలికారు. భానుప్రకాష్‌పై చేయి పడితే ఫామ్‌హౌస్‌పై చేయి వేయాల్సి వస్తుందని సంజయ్‌ హెచ్చరించారు.
 
నగరంలోని టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వద్ద బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన మెరుపు ధర్నా ఉద్రిక్తంగా మారింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ  భృతిని చెల్లించాలని యువ మోర్చా డిమాండ్ చేస్తోంది. 
 
బీజేపీ కార్యాలయం నుంచి టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరిన యువ మోర్చా సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో బీజేవైఎం కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. వెంటనే వారిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు.