బెంగాల్ మంత్రుల కోడ్ ఉల్లంఘ‌న.. బిజెపి ఫిర్యాదు   

ఇద్ద‌రు ప‌శ్చిమ బెంగాల్ మంత్రులు ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘించార‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి బీజేపీ  లేఖ రాసింది. సాక్షాత్ రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హ‌కీం గ‌త నెల 27న ఒక మ‌సీదు వ‌ద్ద మైనారిటీ సామాజిక వ‌ర్గంతో జ‌రిగిన స‌మావేశంలో మాట్లాడుతూ బీజేపీ ఓట‌మి ల‌క్ష్యంగా మైనారిటీల‌కు తాయిలాలు ప్ర‌క‌టించార‌ని బీజేపీ ఆరోపించింది.

ఈ మేర‌కు స‌ద‌రు మంత్రి ప్ర‌సంగానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను జ‌త చేసిన‌ట్లు తెలిపింది. మంత్రి ఇచ్చిన హామీల‌ను ఆమోదించాల‌ని ఆయ‌న ప‌క్క‌నే నిల‌బ‌డిన ఇమామ్ కోరార‌ని ఆరోపించింది. హౌరాలో రామ‌క్రుష్ణాపూర్ కోఆప‌రేటివ్ బ్యాంక్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన డ‌బ్బు పంపిణీ కార్య‌క్ర‌మంలో మ‌రో మంత్రి అరూప్ రాయ్ పాల్గొన్నార‌ని ఇది కోడ్ ఉల్లంఘ‌నే అని బీజేపీ ఆరోపించింది.

గ‌తంలోనూ ప‌శ్చిమ బెంగాల్ మంత్రులు కోడ్ ఉల్లంఘించార‌ని, కానీ ఎన్నిక‌ల సంఘం చ‌ర్య‌లు తీసుకోలేద‌ని పేర్కొంది.  వీరిని ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా నిషేధించాల‌ని ఈసీని కోరింది. ఈ నెల 27 నుంచి ఎనిమిది ద‌శ‌ల్లో ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఇలా ఉండగా,  ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ కూట‌మి వ్యూహాన్ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత ఆనంద‌శ‌ర్మ బ‌హిరంగంగానే విమ‌ర్శించారు. 

ముస్లిం మ‌త పెద్ద అబ్బాస్ సిద్దిఖి సార‌థ్యంలో నూత‌నంగా ఏర్పాటైన ఇండియ‌న్ సెక్యుల‌ర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్‌), ఇత‌ర మిలిటెంట్ సంస్థ‌ల‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవ‌డం పార్టీ కీల‌క సిద్ధాంతాల‌కు వ్య‌తిరేకం అని ధ్వజమెత్తారు. గాంధేయ‌, నెహ్రూ లౌకిక వాదానికి వ్య‌తిరేకం అని మండిపడ్డారు. 

ఐఎస్ఎఫ్ వంటి సంస్థ‌ల‌తో పొత్తుకు కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడ‌బ్ల్యూసీ) ఆమోదం పొందాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆనంద‌శ‌ర్మ స్పష్టం చేశారు.  బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ ఫ్రంట్‌, ఐఎస్ఎఫ్ సంయుక్తంగా పోటీ చేస్తున్నాయి. ఆదివారం కోల్‌క‌తాలోని బ్రిగేడ్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌లో ప‌శ్చిమ బెంగాల్ పీసీసీ అధ్య‌క్షుడు అధిర్ రంజ‌న్ చౌద‌రి, ఐఎస్ఎఫ్ చీఫ్ అబ్బాస్ సిద్దిఖితో క‌లిసి పాల్గొన్నారు.

ఈ స‌భ‌లో పాల్గొన‌డంతోపాటు ఐఎస్ఎఫ్‌తో ప‌శ్చిమ బెంగాల్ పీసీసీ అధ్య‌క్షుడు పొత్తు పెట్టుకోవ‌డానికి ఆమోదం తెలుప‌డం సిగ్గుచేట‌ని, బాధాక‌రం అని ఆనంద‌శ‌ర్మ విచారం వ్యక్తం చేశారు.