కరోనాతో బీజేపీ ఎంపీ నందకుమార్ మృతి

కరోనా మహమ్మారి బారిన పడి మరో బీజేపీ ఎంపీ కన్నుమూశారు. మధ్యప్రదేశ్‌ బీజేపీ లోక్‌సభ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్ తుదిశ్వాస విడిచారు. ఆయనకు కరోనా  పాజిటివ్ రావడంతో గత 15 రోజులుగా ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఉదయం కన్నుమూశారు. 

సెప్టెంబర్ 8, 1952లో బుర్హాన్‌పూర్‌లో జన్మించిన నంద్ కుమార్.. మున్సిపల్ కౌన్సిల్‌కు చైర్మన్ ఎన్నికై తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన ఖాండ్వా నుంచి అయిదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009-14మధ్య ఐదేళ్ల  కాలంలో తప్ప 1996 నుండి చౌహాన్ లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు.అదేవిధంగా మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేశారు.

వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న చౌహన్‌ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మధ్యే పరామర్శించారు. నంద్ కుమార్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ  సంతాపం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయడానికి నంద్ కుమార్ ఎనలేని కృషి చేశారని మోదీ కొనియాడారు.

‘ఖాండ్వా లోక్‌సభ ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ జీ మరణించినందుకు బాధగా ఉంది. పార్లమెంటరీ కార్యకలాపాలు, సంస్థాగత నైపుణ్యాలు మరియు మధ్యప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషి.. ఆయన చిరకాలం గుర్తుండేలా చేస్తుంది. ఆయన కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

బీజేపీ చురుకైన నాయకుడు, అంకితభావంతో పనిచేసిన నాయకుడిని కోల్పోయామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి  శివరాజ్ సింగ్ చౌహన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. నందు భయ్యా లాంటి ప్రజా నేతను మరణించడం తనకు తీరని లోటని సీఎం ట్వీట్ చేశారు.
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శ్యామల హిల్స్ లోని స్మార్ట్ సిటీ పార్కులో నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ స్మత్యర్థం సీఎం శివరాజ్ సింగ్ మొక్క నాటి నివాళులు అర్పించారు. అటు నందకుమార్ మృతిపై బీజేపీ శ్రేణులు, నేతలు విషాదంలో మునిగిపోయారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ,  తమనేత అకాలమరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.