వ్యాక్సిన్ ధర రూ 250కు మించరాదు 

కరోనా వైరస్‌ కట్టడి కోసం కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రజలకు మరింతగా అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. 60 ఏండ్లు పైబడిన వారితో పాటు 45 ఏండ్లు పైబడి పలు వ్యాధులతో బాధపడే వారికి ప్రైవేట్‌ దవాఖానల్లో అందుబాటులో ఉండే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఒక్కో డోసు ఖరీదును  గరిష్టంగా రూ 250గా ప్రభుత్వం ఖరారు చేసింది.
వ్యాక్సిన్‌ ధర రూ 150 కాగా సర్వీస్‌ ఛార్జ్‌ రూ 100గా నిర్ణయించి మొత్తం ధర రూ 250 మించరాదని స్పష్టం చేసింది. ప్రైవేట్‌ ‌ దవాఖానల్లో  కొవిడ్‌ వ్యాక్సిన్‌ ధర రూ 250కి మించకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఇక మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే మూడో దశ వ్యాక్సినేషన్స్‌కు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
వ్యాక్సినేషన్‌ తదుపరి ప్రక్రియ దేశవ్యాప్తంగా 10,000 ప్రభుత్వ దవాఖానలతో పాటు 20,000కుపైగా ప్రైవేట్‌ దవాఖానల్లో సాగనుంది. ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సిన్‌ లభ్యమవనుండగా, ప్రైవేట్‌ దవాఖానల్లో వ్యాక్సిన్‌ తీసుకోవాలని కోరుకునే వారు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని, దీని ధరను ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేస్తుందని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ వెల్లడించారు.
కాగా లబ్ధిదారులు కొవిన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం లేదా ఆరోగ్య సేతు లాంటి ఇతర ఐటి అప్లికేషన్ల ద్వారా ముందుగానే తమ పేరును తామే నమోదు చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. తమకు అనువైన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని (సివిసి)లబ్ధిదారులు ఎంపిక చేసుకొని వ్యాక్సినేషన్‌కు అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోవచ్చని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నది. 
ఇలా  ఉండగా, కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం శనివారం దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా కేవలం 6 రాష్ట్రాలలోనే నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 85.75 శాతం ఆ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. ఈ జాబితాలో మహారాష్ట్రలో అత్యధికంగా 8,333 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత కేరళలో 3,671 కేసులు, పంజాబ్‌లో 622 కేసులు, కర్ణాటకలో 571, తమిళనాడులో 481, గుజరాత్‌లో 460 కేసులు నమొదయ్యాయి. మొత్తంగా 16,488 కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి.