చినాబ్‌ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని జమ్మూ కశ్మీర్‌లోని చినాబ్‌ నదిపై నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం ఆ బ్రిడ్జికి సంబంధించిన ఫొటో వైరల్‌ అవుతోంది. మూడేళ్ల కింద‌ట దీని నిర్మాణం ప్రారంభం కాగా.. ప్ర‌స్తుతం దీని ప్ర‌ధాన ఆర్క్ దాదాపు పూర్తి కావ‌స్తోంది.
ఈ  సందర్భంగా రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ బ్రిడ్జి ఫొటోను షేర్‌ చేశారు. ఓ అద్భుత క‌ట్ట‌డం సిద్ధ‌మ‌వుతోందని అంటూ మ‌రో ఇంజినీరింగ్ మైలురాయిని అందుకునే దిశ‌గా భారతీయ రైల్వేలు అడుగులు వేస్తోంద‌ని ఆయ‌న కొనియాడారు.
క‌శ్మీర్‌ను మిగ‌తా దేశంతో క‌లిపే రైల్వే ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. 476 మీటర్ల పొడవైన ఈ వంతెనను ఉక్కుతో నిర్మిస్తున్నారు. మొత్తం బ్రిడ్జి పొడవు 1,315 మీటర్లు కాగా.. దీనికయ్యే వ్యయం రూ.1,250 కోట్లు.
 
చీనాబ్ న‌దికి 359 మీట‌ర్ల ఎత్తులో దీనిని నిర్మిస్తున్నారు. అంటే ఇది ప్యారిస్‌లోని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఈఫిల్ ట‌వ‌ర్ ఎత్తు కంటే కూడా 35 మీట‌ర్లు ఎక్కువ కావ‌డం విశేషం. 8 మ్యాగ్నిట్యూడ్ తీవ్ర‌త‌తో వ‌చ్చే భూకంపాల‌ను కూడా త‌ట్టుకునే విధంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. 
 
ఉధంపూర్‌- శ్రీనగర్‌-బారాముల్లా రైల్వేసెక్షన్‌లో ఈ లైన్‌ను నిర్మిస్తున్నారు. కాగా, ఇది ఒక ఆర్చర్  వంతెన. ఈ నది జమ్మూ కశ్మీర్‌లోని బక్కల్‌, కౌరి మధ్య చీనాబ్‌ నదిపై సంధానంగా ఉంటుంది. ఈ వంతెనను జమ్మూ కశ్మీర్‌లోని యుఎస్‌బిఆర్‌ఎల్‌ ప్రాజెక్ట్‌ కత్రా-లావోలి విభాగం నిర్మిస్తోంది.