ఉగ్రవాదానికి మూలకారకులు వారే

భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం వ్యాప్తిచెందడానికి వారే కారకులని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత డిప్యూటీ ప్రతినిధి నాగరాజ్‌ నాయుడు ఆరోపించారు. పాకిస్తాన్‌ పేరును నేరుగా ప్రస్తావించకుండా వారి కారణంగానే ఉగ్రవాదం అన్ని దేశాల్లో పెరుగుతున్నదని దుయ్యబట్టారు. 

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో నాగరాజ్‌ నాయుడు మాట్లాడుతూ పొరుగున ఉన్న దేశం ఒకటి ఉగ్రవాదులకు ఆవాసం కల్పిస్తూ వారిని పెంచిపోషిస్తున్నదని చెప్పారు. ఆ దేశం ప్రోత్సాహంతోనే వారు అన్ని దేశాల్లో పెట్రేగిపోతున్నారన్నారు. ఉగ్రవాదానికి పొరుగు దేశ ప్రభుత్వ సహకారం కూడా ఉన్నదని భారత ప్రతినిధి చెప్పారు.

భారతదేశం అనేక దశాబ్దాలుగా ప్రచ్ఛన్న యుద్ధం చేస్తూ సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నట్లు నాగరాజ్‌ నాయుడు తెలిపారు. అక్కడి ప్రభుత్వం ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇస్తుండటం వల్ల ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారని ఆరోపించారు. ఉగ్రవాదులకు శిక్షణతోపాటు నిధులు కూడా సమకూరుస్తున్నారని, నిఘా, ఆయుధాలు అందిస్తూ తద్వారా వారు తమ దేశంలో హింసను వ్యాప్తి చేస్తున్నారని దుయ్యబట్టారు. 

పాకిస్తాన్ పేరును ఎత్తకుండా.. కొన్ని దేశాలు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నాయని తెలిపారు. ఈ దేశాలు ఉగ్రవాద గ్రూపులకు అన్ని రకాల సహాయం, డబ్బును కూడా అందిస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలోని అన్ని దేశాలు కలిసి ఇటువంటి దేశాలను ఎదుర్కోవలసి ఉంటుందని.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పోరాడటం మనందరి సమష్టి బాధ్యత అని గుర్తుచేశారు.