కాల్పుల నిలుపుదలకు భారత్ – పాక్ నిర్ణయం 

సుదీర్ఘకాలంగా భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో కొనసాగుతున్న సైన్యం ఘర్షణలకు తెరపడనుంది. జమ్ముకాశ్మీర్‌ నియంత్రణ రేఖ వెంబడి(ఎల్‌ఒసి)తో పాటు ఇతర ప్రాంతాల్లో కాల్పులను నిలిపివేసేందుకు ఓ ఒప్పందానికి వచ్చినట్లు ఇరు దేశాలకు చెందిన సైన్యాలు ప్రకటించాయి.
 
ఈ నెల 24-25 అర్ధరాత్రి నుండి దీన్ని అమలు చేయనున్నటు పేర్కొన్నాయి. ఇరు దేశాల మధ్య గతంలో కాల్పుల విరమణ  ఉన్నప్పటికీ… ఇరు దేశాలు సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు జరుపుతూ ఒప్పందానికి తూట్లు పొడస్తూ ఉంటాయి. ఈ కాల్పుల కారణంగా అనేక మంది జవాన్లతో పాటు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 
 
వీటికి స్వస్తి పలికేందుకే ఈ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరు దేశాలకు చెందిన మిలిటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్స్‌ సంయుక్తంగా ఓ ప్రకటన‌ను విడుదల చేశాయి. టెలిఫోన్‌ హాట్‌లైన్‌ ద్వారా ఇద్దరు అధికారులు సంప్రదింపులు జరిపినట్లు ఆర్మీ ప్రకటించింది.
 
 ‘‘ఇరు దేశాలు పరస్పరం ప్రయోజనం పొందడానికి, స్థిరమైన శాంతిని సాధించాలన్న ఆసక్తితో ఈ నిర్ణయం తీసుకున్నాం. హింసకు దారితీసే పరిస్థితుల వల్ల తరుచూ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. దీంతో డీజీఎస్‌ఎంవో స్థాయిలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.’’ అని ఇరు దేశాల అధికారులు తెలిపారు. 
 
ఇరు వైపులా నియంత్రణ రేఖ వెంబడి, అన్ని సెక్టార్లలో స్వేచ్ఛా, స్పష్టమైన, స్నేహపూర్వక వాతావరణం గురించి ఇరు పక్షాలు సమీక్షించుకున్నాయని ఆ ప్రకటన‌లో పేర్కొన్నారు.  ఈ పరస్పర అంగీకారం ద్వారా నియంత్రణ రేఖ వెంబడి హింస తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
సరిహద్దుల్లో స్థిరమైన శాంతిని సాధించాలనే లక్ష్యంతో హింసకు దారితీసే అంశాలు వంటి ప్రధాన సమస్యలు,ఆందోళనలను పరిష్కరించుకోవడానికి ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయంటూ ఆ ప్రకటన పేర్కొంది. 
 
గురువారం అర్థరాత్రి నుండి అమల్లోకి వచ్చేలా సరిహద్దు రేఖ వెెంబడి, ఇతర సెక్టార్లలో కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయంటూ ఉమ్మడి ప్రకటనలో తెలిపారు.నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరపకూడదని ఇరు దేశాలు 2003 లో ఒప్పందాలు చేసుకున్నాయి. అయినా… తరుచూ ఈ ఒప్పందానికి పాక్ తూట్లు పొడుస్తూనే ఉంది. 
 
పరస్పర అంగీకారం కుదిరినా సరే, నియంత్రణ రేఖ వెంబడి మాత్రం భారత్ బలగాలను మోహరించే ఉంచింది. అక్రమ చొరబాట్లను నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.