అమేథీలో ఇంటిస్థలం కొనుగోలు చేసిన స్మృతి ఇరానీ  

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కొంత స్థలాన్ని కొన్నారు. ఆ స్థలంలో త్వరలోనే ఓ ఇంటిని కూడా నిర్మించబోతున్నారు. భూమి రిజిస్ట్రేషన్ అనంతరం మాట్లాడిన ఆమె.. రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించకుండా  అమేథీ నియోజకవర్గానికి చెందిన ఏ ఒక్క ఎంపీ కూడా అక్కడ నివాసం ఉంటూ పాలన చేయలేదని ఎద్దేవా చేశారు. 

గత ఎన్నికలలో రాహుల్ గాంధీని ఓడించి వారి కుటుంభంకు బలమైన అమేథీ నుండి లోక్ సభకు ఎన్నికైన స్మ్రితి ఇరానీ ఇప్పుడు తమ ఎంపీ తమ నియోజకవర్గంలోనే నివాసం ఉంటూ పాలన చేయడం చూస్తే అమేథీ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతారని తెలిపారు.

అమేథీ నియోజకవర్గంలో నివాసం ఏర్పరచుకుని.. అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనే స్మృతి ఇరానీ హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో రాహుల్‌గాంధీపై భారీ మెజారిటీతో గెలుపొందారు. అందుకే ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు అద్దె ఇంట్లో ఉంటున్న ఆమె ఇప్పుడో సొంత ఇల్లు ఏర్పర్చుకొనే ప్రయత్నం ప్రారంభించారు.

ఇప్పుడు నియోజకవర్గంలో సొంతింటి నిర్మాణం కోసం స్థలాన్ని కొనుగోలు చేశానని స్మృతి ఇరానీ చెప్పారు. త్వరలోనే ఈ స్థలంలో భూమిపూజ ఉంటుందని.. దీనికి నియోజకవర్గ ప్రజలు ఆహ్వానితులేనని ఆమె తెలిపారు.