అహ్మదాబాద్‌లోక్రికెట్ స్టేడియంకు మోదీ పేరు 

ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని మొతెరా క్రికెట్ స్టేడియం పేరు మారిపోయింది. పునర్నిర్మాణానికి ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం అని ఉన్న ఈ పేరును తాజాగా నరేంద్రమోదీ స్టేడియంగా పేరుగా మార్చారు. ఇంగ్లండ్-ఇండియా టెస్ట్ మ్యాచ్‌కి ముందు ఈ పేరు మార్చినట్లు బుధవారం ప్రకటించారు. ఈ స్టేడియంకు సర్దార్ పేరు ఉన్నప్పటికీ మొతేరా అనే ప్రాంతంలో ఉండడం వల్ల దీనిని వాడుకలో మొతేరా స్టేడియం అని కూడా పిలుస్తుంటారు.

బుధవారం ఈ స్టేడియం ప్రారంభోత్సవం భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా జరిగింది. ఈ సమావేశానికి హోమంత్రి అమిత్ షా, బీసీసీఐ కార్యదర్శి జయ్ షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. వీరందరి సారధ్యంలో అంగరంగవైభవంగా ఈ క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవం జరిగింది. 

ఈ సందర్భంగా భారత్ త‌ర‌ఫున వందో టెస్ట్ ఆడుతున్న పేస్‌బౌల‌ర్ ఇషాంత్ శ‌ర్మ‌కు జ్ఞాపిక‌ను జ్ఞాపికతో రాష్ట్రపతి సత్కరించారు. అమిత్ షా  ఇషాంత్‌కు ప్ర‌త్యేక‌మైన క్యాప్ అందించారు. వందో టెస్ట్ ఆడుతున్న ఇషాంత్‌కే తొలి బంతి వేసే అవ‌కాశం రావ‌డం విశేషం. అయితే ఈ స్టేడియం ప్రారంభోత్సవానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హాజరు కాలేకపోయారు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని బీసీసీఐ పేర్కొంది.

ఇప్పటి వరకు ప్రపంచంలో రెండవ అతిపెద్ద క్రీడా మైదానంగా చెప్తూ వస్తున్న ఈ స్టేడియం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా మైదానంగా మారినట్లు అమిత్ షా తెలిపారు. దీని సీటింగ్ కెపాసిటీ 1,32,000. కాగా, 1,10,000 సీట్ల కెపాసిటీతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా, ప్రపంచంలో రెండవ పెద్ద స్పోర్ట్స్ స్టేడియంగా వార్తలు వచ్చాయి. అయితే కరోనా దృష్ట్యా ప్రస్తుతం 55,000 మంది సందర్శకులను మాత్రమే అనుమతిస్తున్నారు.