
కోట్ల రూపాయల ఆదాయం గల సింగరేణిని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్ ఆరోపించారు. సింగరేణిలో పెత్తనం చలాయిస్తూ అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కవిత సింగరేణిలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపిస్తామని, అవినీతి పరులకు శిక్షలు పడేవరకు విశ్రమింపమని తరుణ్‌చుగ్ స్పష్టం చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీ రాంపూర్‌లో పర్యటించిన ఆయన.. అక్కడి కార్మికులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సింగరేణికి కవిత యూనియన్ లీడర్‌గా మారి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
కార్మికులు, కార్మిక నేతలపై ఆమె ఆధిపత్యం చేలాయిస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి టీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతికి అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. సింగరేణిలో అవినీతిని చూస్తూ ఊరుకోమన్నారు. సింగరేణి సీఎండీ సరిగా పనిచేయడం లేదని,, టీఆర్ఎస్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు.
ప్రాణహిత ప్రాజెక్టును మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్.. ఈ నీళ్లను తన సెవెన్ స్టార్ ఫామ్ హౌస్ కు తరలిస్తున్నారని తరుణ్ చుగ్ ఆరోపించారు. గోదావరి, ప్రాణహిత నది వెంట ఉన్న ప్రజలకు మాత్రం తాగేందుకు కూడా నీళ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలనను ఖతం చేయాలని ప్రజలు డిసైడ్ అయ్యారని.. కేసీఆర్ కు అల్విదా చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని స్పష్టం చేశారు.
ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపు తుఫాను కాదని.. సునామీ అని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో అధికారం సాధించేందుకు సంజయ్ నాయకత్వంలో బిజెపి ముందుకు వెళ్తుంది. ఆదివాసీ హక్కుల కోసం నైజాం పాలనకు ఎదురొడ్డి జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన యోధుడు కుమ్రంభీం పురుటిగడ్డ నుంచే కేసీఆర్ ను గద్దె దింపే మహోద్యమానికి నాంది పలుకుతున్నాం” అని తరుణ్ చుగ్ ప్రకటించారు.
ఆదివాసీలకు అండగా నిలుస్తున్న బీజేపీపై టీఆర్ఎస్ సర్కారు కేసులు పెడుతోందని, ఈ కేసులకు భయపడబోమని స్పష్టం చేశారు. నిజాం రాజుల ఆలోచనకు ప్రతిరూపంగా కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తోందని, తమను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తే రెట్టింపు ధైర్యంతో ముందుకెళ్తామని వెల్లడించాయిరు.
రాష్ట్రంలో చేస్తున్న ప్రతి పనిలో కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పర్సంటేజీల కోసం తండ్లాడుతున్నారని తరుణ్ చుగ్ ఎద్దేవా చేశారు.టీఆర్ఎస్ అవినీతిపై కేంద్ర హోం శాఖకు నివేదిస్తామని ఆయన తెలిపారు. అవినీతి పరులకు శిక్ష పడేదాకా వదలమని ఆయన హెచ్చరించారు.
వీరి సమక్షంలో సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ పాల్వాయి హరీష్ బాబు పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కమలం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ కండువా కప్పి పాల్వాయి హరీష్ బాబు, అయన అనుచరులను పార్టీలోకి అహ్వనించారు. ఈ సభకు పాల్వాయి అభిమానులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
More Stories
మందుపాతరాలతో మావోయిస్టులు భద్రతా బలగాల కట్టడి!
హిందూ సమాజ పునర్జీవనమే ఆర్ఎస్ఎస్ ఎజెండా
జస్టిస్ వర్మను దోషిగా చూపుతున్న నివేదిక!