ఉగ్రవాదంతో మానవాళికి పెనుముప్పు…  భారత్ హెచ్చరిక

ఉగ్రవాదం మానవాళికి పెను ముప్పు అని ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్ఆర్‌సీ)లో భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదం ఎన్నటికీ సమర్థనీయం కాదని గట్టిగా తెలిపింది. మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన ముప్పుల్లో ఒకటిగా ఉగ్రవాదం కొనసాగుతోందని పేర్కొంది. 

యూఎన్‌హెచ్ఆర్‌సీ 46వ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం మాట్లాడుతూ ఉగ్రవాదంపై భారత్ వైఖరిని స్పష్టం చేసారు.  ‘‘ఉగ్రవాదం ఎన్నటికీ సమర్థనీయం కాదు. ఇది మానవాళికి వ్యతిరేకమైన నేరం, ఇది అత్యంత విశిష్టమైన ప్రాథమిక హక్కును – జీవించే హక్కును- ఉల్లంఘిస్తుంది. మానవ హక్కులను అంతర్జాతీయంగా ప్రోత్సహించేందుకు, పరిరక్షించేందుకు భారత దేశం ఎల్లప్పుడూ చురుగ్గా కృషి చేస్తోంది’’ అని జైశంకర్ తేల్చి చెప్పారు.

భారత రాజ్యాంగం గొప్పతనాన్ని వివరిస్తూ, ‘‘మా రాజ్యాంగం మౌలిక మానవ హక్కులను ప్రాథమిక హక్కులుగా పేర్కొంది. సివిల్, పొలిటికల్ హక్కులకు హామీ ఇస్తోంది, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులు అభ్యుదయంతో సాకారం కావడానికి నిబంధనలను నిర్దేశించింది’’ అని జైశంకర్ పేర్కొన్నారు. నిబద్ధత, సంభాషణ, సంప్రదింపుల స్ఫూర్తి మార్గదర్శకత్వంతో యూఎన్‌హెచ్ఆర్‌సీ పట్ల భారత్ వైఖరి రూపొందిందని తెలిపారు. 

మానవ హక్కుల ప్రోత్సాహం, పరిరక్షణలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రభుత్వాల మధ్య చర్చలు, సంప్రదింపులు, సహకారం, సాంకేతిక సహాయం, సామర్థ్య నిర్మాణం ద్వారా ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనాలంటే వివిధ సంస్థలు, యంత్రాంగాల్లో సంస్కరణలు అవసరమని చెప్పారు. 

మానవ హక్కుల ఎజెండా అమలుకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని జైశంకర్ తెలిపారు. ముఖ్యంగా ఉగ్రవాదం నుంచి తీవ్రమైన సవాలు ఎదురవుతున్నట్లు తెలిపారు. పూర్వ కాలం నుంచి వస్తున్న ఆందోళనలు కూడా అంతే బలంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ అసమానతలు, సాయుధ సంఘర్షణలు వంటివి చాలా కాలం నుంచి వస్తున్నాయని తెలిపారు.

 ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి వల్ల పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారినట్లు తెలిపారు. యూఎన్‌హెచ్ఆర్‌సీ సభ్య దేశంగా భారత దేశం ఇతర సభ్య దేశాలతో కలిసి పని చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మానవ హక్కుల అమలులో లోపాల పరిష్కారానికి కృషి చేసేటపుడు సభ్య దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా, న్యాయబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.