భారత్ వ్యాక్సిన్ లకు భారీ డిమాండ్ 

గత ఏడాది కరోనా సమయంలో ఆరోగ్య రంగంలో భారత దేశ సామర్థం పట్ల ప్రపంచ దేశాల విశ్వాసం ఇనుమ డించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కరోనా కట్టడికి మేడిన్ ఇండియా వ్యాక్సిన్ల డిమాండ్‌ను మనం అధిగమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

కరోనా వైరస్ మహమ్మారి తరహాలో భవిష్యత్తులో మరిన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో చేపట్టిన చర్యలపై మంగళవారం జరిగిన ఓ వెబినార్‌లో ప్రధాని మాట్లాడుతూ ప్రస్తుతం ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో అసాధారణ కేటాయింపులుండడం ఈ రంగం పట్ల మన నిబద్ధతుకు నిదర్శనమని పేర్కొన్నారు. 

రాబోయే రోజుల్లో కోవిడ్19లాంటి పలు సవాళ్లను ఎదుర్కొనేలా కరోనా వైరస్ మనకు గుణపాఠాలను నేర్పిందని ప్రధాని చెప్పారు. ‘గత ఏడాది దేశానికి ముఖ్యంగా ఆరోగ్య రంగానికి ఒక విధంగా ‘అగ్నిపరీక్ష’. ఈ అగ్నిపరీక్షలో ఆరోగ్య రంగం విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. ఎన్నో వేల ప్రాణాలను మనం కాపాడగలిగాం’ అని ప్రధాని తెలిపారు.

వైద్యపరికరాలనుంచి మందుల వరకు, వెంటిలేటర్లనుంచి వ్యాక్సిన్ల వరకు, శాస్త్రీయ పరిశోధనలనుంచి మౌలిక సదుపాయయాల వరకు భారత్ భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య ఎమర్జెన్సీనైనా ఎదుర్కొనేందుకు భారత్  సిద్ధంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. 15ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఆరోగ్య సేవలను దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థలకు రూ.70,000 కోట్లు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.