ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఆటంకం! 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా ప్రతిఘటించిన పంచాయతి ఎన్నికలను నాలుగు దశలలో దిగ్విజయంగా పూర్తిచేసి, ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల నిర్వహణ చేపట్టిన ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను జరిపే అవకాశాలు మాత్రం కనబడటం లేదు. 
 
గత ఏడాది ప్రారంభంలో ఈ ఎన్నికల పక్రియ ప్రారంభమైన సమయంలో ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలపై దౌర్జన్యాలకు, అక్రమాలకు అధికార పక్షం పాలపడిన్నట్లు వచ్చిన పలు ఆరోపణలను విచారించకుండా హైకోర్టు స్టే విధించడంతో ఆ కేసు పూర్తయితే గాని ముందుకు వెళ్లే వీలు లేదు. మార్చ్ చివరి నాటికి నిమ్మగడ్డ పదవీకాలం పూర్తవుతున్న దృష్ట్యా ఆ లోగా ఈ వివాదం ముగిసే అవకాశం కనబడటం లేదు. 
 
ఎన్నికల పక్రియ ప్రారంభమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమీషన్ తో సమరస్యంగానే వ్యవహరించింది. ప్రభుత్వంతో ఎటువంటి ఘర్షణ లేకుండానే ఎన్నికల పక్రియను నిమ్మగడ్డ సహితం కొనసాగిస్తున్నారు. కానీ  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో మాత్రం ఒక అవగాహనకు రాలేక పోతున్నారు. 

 ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) హైకోర్టును అభ్యర్థించింది. న్యాయస్థానం జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులతో విచారణ ముందుకు సాగడం లేదని పేర్కొంది.

గతంలో ఫామ్‌-10 లేని ఏకగ్రీవ అభ్యర్థులంతా గత శుక్రవారం కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఫామ్‌-10 తీసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. బెదిరింపులు, దౌర్జన్యాల కారణంగా గత ఏడాది మార్చిలో నామినేషన్లు వేయని వారు, వేధింపుల కారణంగా ఉపసంహరించుకున్నవారు, వివిధ రాజకీయ పార్టీలు, వర్గాలు ఇప్పటికీ ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలిపింది. 

వీటిపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. అయితే  ఏకగ్రీవాల పై విచారణకు ఆదేశించే అధికారం ఎస్‌ఈసీకి లేదని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదించారు. ఎస్‌ఈసీ కౌంటర్‌ దాఖలు చేశాకే ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. 

ఇరు పక్షాల  వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఎస్‌ఈసీని ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే సోమవారాని(1వ తేదీ)కివాయిదా వేశారు. మధ్యంతర ఉత్తర్వులను కూడా పొడిగిస్తూ మంగళవార ఉత్తర్వులు జారీ చేశారు.