అగ్రవర్ణ పేదలకు జగన్ కొత్త పథకం

అగ్రవర్ణ పేదలకు కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నట్టు మంత్రి పేర్నినాని తెలిపారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మీడియాతో నాని మాట్లాడుతూ.. రూ.670 కోట్లతో ఈబీసీ నేస్తం పథకానికి కేబినెట్ ఆమోదముద్ర వేసిందని వెల్లడించారు. 
 
45-60 ఏళ్ల ఈబీసీ మహిళలకు మూడేళ్లపాటు ఏటా రూ.15 వేలు చొప్పున రూ 45 వేలు ఆర్థిక సాయం అందుతుని చెప్పారు. నవరత్నాల అమలు క్యాలెండర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెబుతూ  23 రకాల సంక్షేమ పథకాలకు నెలవారీగా షెడ్యూల్ ప్రకటించారు. 
 
5.69 కోట్ల మంది పేదలకు క్యాలెండర్ ప్రకారం పథకాలు అమల చేయనున్నట్టు తెలిపారు. జగనన్న విద్యా దీవెనలో సంపూర్ణంగా బోధనా ఫీజు చెల్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. . పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను 300 చదరపు అడుగుల లోపు ఉంటే.. రూపాయికే లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
 
రాష్ట్రంలో జరగనున్న అన్ని ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్‌ మంత్రులకు వివరించారు. కాగా పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయాలపై సీఎం మంత్రులను అభినందించారు. పంచాయతీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 80 శాతం ఫలితాలు సాధించామని జగన్‌ తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై  అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.