దుర్గగుడిలో అక్రమాలపై16 మంది సస్పెండ్

దేశ వ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు గల విజయవాడ దుర్గ గుడిలో భారీస్థాయిలో అక్రమాలు, అవినీతి జరుగుతున్నట్లు వెలుగులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.  కార్యనిర్వహణాధికారి సురేష్ బాబుపై బదిలీ వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశింపనున్నది.
అక్రమాలకు సంబంధించి దేవాదాయశాఖ 16 అంశాలను పేర్కొంటూ పంపిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే 16 మంది సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.  ఆరుగురు  సూపరింటెండెంట్‌ స్థాయి సిబ్బందితో సహా మొత్తం 16 మంది ఉద్యోగులను ప్రభుత్వం సోమ, మంగళ వారాలలో సస్పెండ్ చేసింది.
గుడిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం అందజేసిన నివేదిక మేరకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. గుడి భూములు, షాపుల లీజు వ్యవహారాలతో పాటు అన్నదానం, దర్శనాల టికెట్ల అమ్మకం, అమ్మవారి చీరల వ్యవహారాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అందించిన ప్రాథమిక సమాచారం వెల్లడించింది.
ఈ నివేదిక  మేరకు ఏడు రకాల విభాగాల్లో పనిచేసే సిబ్బందిని తక్షణమే సస్పెండ్‌ చేయాల్సిందిగా ఆలయ ఈవో సురేష్‌బాబును ఆదేశిస్తూ దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావు సోమవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై 5 రోజులపాటు కొనసాగిన అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తనిఖీలు, విచారణ సోమవారంతో ముగిశాయి. ఆలయంలోని కీలకమైన విభాగాలన్నింటినీ అధికారులు లోతుగా పరిశీలించారు. వేటు పడినవారిలో చీరలు, ప్రసాదాలు, అన్నదానం, స్టోర్ తదితర 8 విభాగాలకు చెందిన
ఉద్యోగులున్నారు.