మాల్డీవులు, భారత్‌ల మధ్య కీలక రక్షణ ఒప్పందం

ద్వీప దేశం మాల్డీవులు, భారత్‌ల మధ్య కీలక ఒప్పందం జరిగింది. దాదాపు 50 మిలియన్‌ డాలర్ల విలువ చేసే రక్షణ రంగ ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. మాల్దీవుల భద్రతపై భారత్‌ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. 

ఈ ద్వీప దేశం తమ సముద్ర సామర్థ్యాన్ని పెంచుకునేందుకు అవసరమైన రక్షణ ప్రాజెక్టులను భారత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రక్షణ ప్రాజెక్టుల కోసం 50 మిలియన్‌ డాలర్ల క్రెడిట్‌ లైన్‌ ఒప్పందం మాల్దీవుల ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఎక్స్‌పోర్ట్స్‌ అండ్‌ ఇంపోర్ట్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మధ్య జరిగింది. 

డిఫెన్స్‌ లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఒప్పందంపై సంతకాలు చేసే కార్యక్రమానికి భారత్‌ తరఫున కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, మాల్దీవుల రక్షణ మంత్రి మరియా దీదీ హాజరయ్యారు. 

తొలుత మాల్దీవుల రక్షణ మంత్రి మరియా దీదీ, ఆర్థిక మంత్రి ఇబ్రహీం అమీర్‌, ఆర్థికాభివఅద్ధి శాఖ మంత్రి ఫయాజ్‌ ఇస్మాయిల్‌, జాతీయ ప్రణాళిక, గఅహ, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మొహమ్మద్‌ అస్లాంతో భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ చర్చలు జరిపిన అనంతరం ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

మాల్దీవుల్లో రెండు రోజుల పర్యటనలో ఉన్న జైశంకర్‌.. ఆ దేశ రక్షణ మంత్రితో స్నేహపూర్వక సమావేశం జరిపారు. రక్షణ సహకారంపై ఉపయోగకరమైన మార్పిడి అని, భారతదేశం ఎల్లప్పుడూ మాల్దీవులకు నమ్మకమైన రక్షణ భాగస్వామిగా ఉంటుందని జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. 

యూటీఎఫ్‌ హార్బర్‌ ప్రాజెక్ట్‌ ఒప్పందంపై రక్షణ మంత్రి మారియా దీదీ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేయడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. ఈ ఒప్పందం మాల్దీవుల కోస్ట్‌ గార్డ్‌ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని, ప్రాంతీయ హ్యూమానిటేరియన్‌ అసిస్టెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ (హెచ్‌ఏడీఆర్‌) ప్రయత్నాలను సులభతరం చేస్తుందని జైశంకర్‌ పేర్కొన్నారు. 

అభివృద్ధిలోనే కాకుండా రక్షణలో కూడా మాల్దీవులతో భాగస్వామి కావడం సంతోషదాయకమని చెప్పారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను స్వాగతించడం, ఆయనతో సమావేశమవడం ఎంతో ఉత్తేజాన్నిచ్చిందని మాల్దీవుల రక్షణ మంత్రి మరియా దీదీ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.