సీఎం ఆదేశాలతోనే బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు 

సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గుర్రంపోడు తండా ఘటనలో బీజేపీ నేతలు, కార్యకర్తలపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని ఆయన ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. 
 
గుర్రంపోడు తండా భూములు గిరిజనులవేనని హైకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. భూములు కబ్జా చేసిన నేతలు గిరిజనులను కొట్టించారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల గుండాలను తెప్పించి గిరిజనులను కొట్టించారని ధ్వజమెత్తారు.   60 రోజులు జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. 
అక్రమ షెడ్లను కూలిస్తే పోలీసులు లాఠీచార్జ్ ఎందుకు చేశారని ప్రశ్నించారు. కొందరు పోలీసులు బడా భూస్వాములకు సహకరిస్తున్నారని సంజయ్  ఆరోపించారు. గుర్రంపోడు ఘటనలో బీజేపీ కార్యకర్తలు, గిరిజనులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో పోలీసులకు గాయలైనందుకు  బండి సంజయ్ క్షమాపణలు కోరారు. 
రిటర్డ్ ఐజీ ప్రభాకర్ రావు ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గుండాగిరి చేస్తున్నారని ఆరోపించారు. 2023 తర్వాత తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ప్రభాకర్ రావు అక్రమాస్తుల చిట్టా విప్పుతానని.. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని పేర్కొన్నారు.