లాయర్ దంపతుల హత్యకేసులో టీఆర్‌ఎస్ నేత అరెస్ట్!

హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్య కేసులో  టీఆర్‌ఎస్ నేత కుంట శ్రీనివాస్‌తో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో కుంట శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసకున్నారు. వామన్‌రావు హత్య కేసులో ఏ2గా కుంట శ్రీనివాస్ ఉన్నాడు. ఈ అరెస్ట్ తో హత్యలకు అధికార పక్షమే కారణమని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. అరెస్ట్ జరిగిన వెంటనే శ్రీనివాస్‌ను టీఆర్ఎస్‌ నుంచి సస్పెండ్ చేశారు. 

కుంటశ్రీనివాస్‌, అక్కపాక కుమార్‌, వసంతరావు, చిరంజీవిని పోలీసులు విచారిస్తున్నారు. వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పైన పేర్కొన్న నలుగురినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందులో రాజకీయ ప్రమేయం లేదని పోలీసులు కొట్టిపారవేస్తున్న సాక్ష్యాధారాలు అందుకు భిన్నంగా వెలుగులోకి వస్తున్నాయి.

నిందితులు ప్రయయించిన నంబర్ లేని కారు బిట్టు శ్రీనుది అని గుర్తించారు. కారుతోపాటు నిందితులకు కత్తులను, డ్రైవర్‌ను సమకూర్చింది కూడా అతడే అని భావిస్తున్నారు ఈ బిట్టు శ్రీను  అధికార పార్టీకి చెందిన మంథని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ మేనల్లుడే కావడం గమనార్హం. 

హైకోర్టు అడ్వకేట్ దంపతుల హత్యలపై రాష్ట్రవ్యాప్తంగా లాయర్లు భగ్గుమన్నారు. కోర్టుల్లో డ్యూటీలు బాయ్​కాట్ చేసి రోడ్డెక్కారు. ర్యాలీలు, రాస్తారోకోలు చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. హత్యలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లాయర్ల రక్షణకు చట్టాన్ని తీసుకురావాలన్నారు. ఈ హత్యతో సంబంధం ఉన్న వారు ఏ హోదాలో ఉన్నా శిక్షించాల్సిందేనని డిమాండ్​ చేశారు.

హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. ప్రభుత్వ విశ్వసనీయత ప్రశ్నార్థకమని వ్యాఖ్యానించింది. రాష్ట్ర  పోలీసులతో స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరిగే అవకాశం లేదని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. 

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి మంథని ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఇసుక దందాతో అక్రమంగా రూ.900 కోట్ల విలువైన ఆస్తులు, 400 ఎకరాల భూమిని కొనుగోలు చేశారంటూ వామన్‌రావు దంపతులు కోర్టులో కేసు వేశారు. అది అప్పట్లో సంచలనం రేపింది. సరైన ఆధారాలు లేనందున కేసును కోర్టు కొట్టి వేసింది. 

ఈ ప్రాంతంలో జరుగుతున్న ఘటనలు, వ్యవహారాలపై వామన్‌ రావు తరచూ జోక్యం చేసుకుంటుండడం వల్లనే బలమైన రాజకీయ వర్గాలుఆయనను హత్య చేసి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ గ్రామానికే చెందిన కుంట శ్రీనివాస్‌ తమపై దాడి చేశారని రక్తపు మడుగులో రోడ్డుపై పడి ఉన్న వామనరావు చెప్పిన మాటలు, దాడి చేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఏ గ్రూప్‌లో చూసినా కూడా ఇదే వీడియోలు చెక్కర్లు కొడుతున్నాయి.

తీవ్రంగా గాయపడి కొనఊపిరితో చనిపోయే ముందు వామన్‌ చెప్పిన మాటలు మరణ వాగ్మూలంగా మారాయి. పోలీసులకు ఈ కేసు విచారణకు, దాడిపై పలు అనుమానాలు కల్గకుండా వామనరావు చివరి మాటలు సాక్ష్యంగా మారాయి. పట్టపగలే నడిరోడ్డుపై వామనరావు, నాగమణి హత్య దారుణంగా హత్య చేశారు.

కారులో వెళ్తున్న న్యాయవాద దంపతులను దుండగులు మరో కారులో వచ్చి అడ్డుకున్నారు. కారులోంచి న్యాయవాదిని బయటకు లాగి కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు. కారులో ఉన్న ఆయన భార్యపైనా కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీశారు.

హైకోర్టు న్యాయవాదుల దారుణ హత్యపై సీఎం కేసీఆర్‌ స్పందించాలని, లేకుంటే తన పుట్టిన రోజున టీఆర్‌ఎస్‌ గూండాలు ఇచ్చిన గిఫ్ట్‌ను స్వీకరించినట్లుగానే భావించాల్సి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఘటనపై హైకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. హత్యకు గురైన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి మృతదేహాలను పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో గురువారం ఆయన పరిశీలించారు. 

వామన్‌రావు వద్ద ప్రభుత్వం, ప్రముఖుల అక్రమాలపై కోర్టుల్లో వేసిన కేసులను ఉపసంహరించుకోకపోవడంతో హతమార్చారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకేవామన్‌రావు దంపతులను హత్య చేశారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు.

తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వామన్‌రావు దంపతులు కోరినా చర్యలు తీసుకోకపోవడం వల్లే హత్యలు జరిగాయని  బిజెపి ఎమ్మెల్సీ రాంచందర్‌రావు విమర్శించారు. రామగుండం సీపీ, స్థానిక ఏసీపీని తక్షణమే సస్పెండ్‌ చేయాలని డీజీపీ మహేందర్‌ రెడ్డిని కోరారు. న్యాయవాద దంపతుల్ని పాశావికంగా హత్య చేయడాన్ని బీజేపీ మహిళా మోర్చా ఖండించింది. మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ఆధ్వర్యంలో బీజేపీ కార్పొరేటర్లు, నేతలు డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నించారు.

వామనరావు, నాగమణి దంపతుల హత్య వెనుక టీఆర్‌ఎస్‌ హస్తం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఇది అత్యంత కిరాతక చర్య అని, రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరిగినందుకు సీఎం కేసీఆర్‌ సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్యానించారు.