పతంజలి ‘కొరోనిల్‌’కు డబ్ల్యూహెచ్ఓ గ్రీన్‌సిగ్నల్

పతంజలి ఆయుర్వేదిక్ ఔషధం ‘కొరోనల్’ శరీరంలోని ఇమ్యునిటీని పెంచేందుకు, కోవిడ్-19ను అదుపు చేసేందుకు సమర్ధవంతంగా పని చేస్తుందని యోగా గురువు రామ్‌దేవ్ బాబా తెలిపారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, తమ ఔషధానికి భారత ప్రభుత్వంతో పాటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపారు. 150కు పైగా దేశాలకు సరఫరా చేసేందుకు, కోవిడ్-19ని అదుపుచేసేందుకు ‘కొరోనిల్’ సిద్ధంగా ఉందని చెప్పారు.

‘అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శాస్త్రీయ పరిశోధనలు పూర్తి చేసిన అనంతరం కొరోనిల్ ఔషధానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నిల్ ఇచ్చింది. దేశం, ప్రపంచం కూడా అంగీకరించింది. కొరోనిల్‌ను 150 దేశాల్లో అమ్మకాలు జరిపే అవకాశం ఉంది’ అని రామ్‌దేవ్ తెలిపారు.

జూన్ 2020లో కొరోనిల్ లాంచ్ అయినప్పుడు ‘ఇమ్యూనో బూస్టర్’గా లైసెన్స్ ఇవ్వడం జరిగింది. దీనిపై రామ్‌దేవ్ మాట్లాడుతూ, కొరోనిల్ డ్రగ్ తయారీకి ముందు తాము లైసెన్స్ తీసుకున్నామని, ఇమ్యూనిటీ  బూస్టర్‌గా తొలుత లైసెన్స్ వచ్చిందని, ఆ తర్వాత క్లినికల్, కంట్రోల్, ట్రయిల్ రీసెర్చ్ జరిపామని చెప్పారు. 

అయితే ఈ ప్రక్రియకు సమయం పడుతుందని డ్రగ్ లెసెన్స్ అధికారి తమకు చెప్పాడని అన్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి ఆరు నెలలు పట్టిందని, మొదట ఇమ్యునిటీ బూస్టర్ లైసెన్స్‌ను లైసెన్సింగ్ అధికారి ద్వారా తాము పొందామన్నారు. ఇప్పుడు కోవిడ్-19 చికిత్సకు, కోవిడ్‌ అనంతర సమస్యలను కూడా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు కొరోనిల్ ఉపయోగపడుతుదని రాందేవ్ బాబా తెలిపారు.

పాన్ ఇండియా కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రైవ్ గత జనవరి 16న మొదలైంది. ఆ తర్వాతే కొరోనిల్ మార్కెట్లోకి అడుగుపెడుతుండటంపై (జాప్యానికి) కారణం అడిగినప్పుడు, నిజానికి ఔషధం ముందుగానే వచ్చినప్పటికీ, దాని చుట్టూ వివాదం ముసురుకుందని, ఆ అపోహలన్నీ ఇప్పుడు తొలగిపోయాయని రామ్‌దేవ్ బాబా సమాధానమిచ్చారు. 

‘నిజానికి మేమెలాంటి ఆలస్యం చేయలేదు. కొన్ని శక్తుల కారణంగా జాప్యం తలెత్తింది. డ్రగ్ మాఫియా, మెడికల్ టెర్రరిజం వంటివి దీని వెనుక ఉన్నాయి. ప్రజల అపోహలు కూడా ఇప్పుడు తొలగిపోవడం చాలా సంతోషంగా ఉంది. యోగా, ఆయుర్వేదం ప్రపంచాన్ని శాసించే కొత్త శకం రాబోతోందని, ఆరోగ్య రంగంలో ప్రపంచానికి భారతదేశం మార్గనిర్దేశం చేయబోతోందని చెప్పారు.

కోవిడ్-19కు పతంజలి రూపొందించిన ‘ఎవిడెన్స్ బేస్ట్ మెడిసెన్’ పరిశోధనా పత్రాన్ని రామ్‌దేవ్ బాబా శుక్రవారంనాడు ఢిల్లీలో విడుదల చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, మరో మంత్రి నితిన్ గడ్కరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. పతంజలి కోవిడ్ మెడిసిన్ ‘కొరోనిల్’కు చెందిన అన్ని అనుమానాలను ఈ పరిశోధనా పత్రం పటాపంచలు చేస్తుందని రాందేవ్ బాబా ఈ సందర్భంగా తెలిపారు.