నాగాలాండ్ అసెంబ్లీలో తొలిసారి జ‌న‌గ‌ణ‌మ‌న

నాగాలాండ్ అసెంబ్లీలో అరుదైన ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. చ‌రిత్ర‌లో తొలిసారి నాగాలాండ్ అసెంబ్లీలో జ‌న‌గ‌ణ‌మ‌న ప్ర‌తిధ్వ‌నించింది. జాతీయ గీతాన్ని ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆల‌పించారు.  నాగాలాండ్ రాష్ట్రం ఏర్ప‌డిన 58 ఏళ్ల త‌ర్వాత ఈ అరుదైన దృశ్యం చోటుచేసుకోవ‌డం అద్భుతం. 

ఈ నెల 12వ తేదీన 13వ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆ స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌వి అసెంబ్లీని ఉద్దేశిస్తూ ప్ర‌సంగం చేశారు. ఆ ప్ర‌సంగానికి ముందు నాగాలాండ్ అసెంబ్లీలో తొలిసారి జాతీయ గీతాన్ని ఆల‌పించారు.   

నిజానికి నాగాలాండ్ రాష్ట్రం 1963, డిసెంబ‌ర్ ఒక‌టో తేదీన ఏర్ప‌డింది.  కానీ ఆ నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అసెంబ్లీలో జాతీయ గీతాన్ని ఎవ‌రూ ఆల‌పించ‌లేదు.  అయితే తాజాగా స‌మావేశాల్లో జ‌న‌గ‌ణ‌మ‌ణ అసెంబ్లీ హాల్‌లో మోరుమోగింది. దానికి సంబంధించిన వీడియోను సెక్యూర్టీ అన‌లిస్ట్ నితిన్ ఏ గోఖ‌లే త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు.

ఇదో అరుదైన దృశ్య‌మంటూ ఆయ‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.  అసెంబ్లీ స‌భ్యులంతా జ‌న‌గ‌ణ‌మ‌న ఆల‌పిస్తున్న స‌మ‌యంలో నిలుచున్నారు.    భార‌త దేశానికి 1947లో స్వాతంత్య్రం వ‌చ్చింది.  ఆ స‌మ‌యంలో అస్సాం ప్రావిన్సులో నాగాలాండ్ ఉన్న‌ది. అప్ప‌ట్లో అక్క‌డ తిరుగుబాటు ఎక్కువ‌గా ఉండేది.  

1950 ద‌శ‌కంలో విభిన్న‌ తెగ‌ల మ‌ధ్య సంక్షోభం కూడా ఉండేది.  అక్క‌డ చోటుచేసుకున్న హింస వ‌ల్ల ఆ ప్రాంతం అభివృద్ధి కుంటుప‌డింది.  కానీ డిసెంబ‌ర్ ఒక‌టో తేదీ, 1963లో రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.  కోహిమా ప‌ట్ట‌ణాన్ని దానికి రాజ‌ధానిగా చేశారు. ఆ రాష్ట్రంలో 1964లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. 

1964, ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన నాగాలాండ్ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అసెంబ్లీలో ఎందుకు జాతీయ గీతాన్ని ఆల‌పించ‌లేదో తెలియ‌ద‌ని అసెంబ్లీ క‌మీష‌న‌ర్, కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ పీజే ఆంథోనీ తెలిపారు.  కానీ ప్ర‌స్తుతం ప్ర‌వేశ‌పెట్టిన కొత్త సాంప్ర‌దాయాన్ని స‌భ్యులు స్వాగ‌తించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు