రైతులకు అవసరమైన ఆధునిక సాంకేతికత, పెట్టుబడులను తీసుకు రావడానికి వయ్వసాయ రంగంలో సంస్కరణలు అనివార్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన నీతి ఆయోగ్ ఆరవ పాలకమండలి సమావేశంలో మాట్లాడుతూ నేడు దేశం పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొంటున్న వస్తువులు, వంట నూనెలను మన రైతులే సరఫరా చేయగలగాలని చెప్పారు.
అదే విధంగా వ్యవసాయ రంగం భారీ ఎగుమతిదారునిగా మారవలసి ఉన్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ వాతావరణ వ్యవసాయ ప్రణాళిక వ్యూహాలను రూపొందించుకోవాలని ప్రధాని సూచించారు. మనలను వ్యవసాయ ప్రధానమైన దేశంగా పేర్కొంటున్నప్పటికీ రూ 70,000 కోట్ల వరకు విలువ గల వంట నూనెలను దిగుమతి చేసుకొంటున్నామని ప్రధాని గుర్తు చేసారు.
మనం అటువంటి దిగుమతులను నిలిపివేసి, అందుకు చేసే వ్యయాన్ని రైతులకు చేరే విధంగా చూడాలని ప్రధాని పిలుపిచ్చారు. మన రైతులు అటువంటి అనేక ఉత్పత్తులను కేవలం మన దేశపు అవసరాల కోసరమే కాకుండా, ఎగుమతులకు కూడా ఉత్పత్తి చేయగలరని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు.
విధానపరమైన జోక్యాలను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో సుమారు 1,500 చట్టాలను రద్దు చేసినదాని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే విధంగా చేస్తూ పౌరులకు సులభతరమైన జీవనంకు అవకాశం కల్పించాలని ప్రధాని సూచించారు.
కేంద్ర,రాష్ట్రాలు కలిసి పని చేసినప్పుడే సహకార సమాఖ్య మరింత బలోపేతమవుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కేంద్ర,రాష్ట్రాల పనితీరుపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు. పోటీ తత్వాన్ని, సహకార సమాఖ్య విధానాన్ని రాష్ట్రాల మధ్యే కాకుండా.. జిల్లా స్థాయిల్లోనూ బలోపేతం చేయాలని ప్రధాని సూచించారు.
కరోనా కష్టకాలంలో కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేయడం వల్లనే ఆ మహమ్మారిని ఎదుర్కోగలిగామని ప్రధాని చెప్పారు. కరోనా కట్టడిలో ప్రపంచ దేశాలు భారత్ ను కొనియాడాయని ఆయన తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిందని, నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుందని ఆయన చెప్పారు.
కరోనా టీకాల ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని, ప్రజలకు ఉచితంగా బ్యాంకు ఖాతాలు కల్పిస్తున్నామని, వైద్య సదుపాయాలు కూడా పెరిగాయని, నిరుపేదలకు ఉచిత విద్యుత్, ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని ఆయన వివరించారు. ఫిబ్రవరి 1న పార్లమెంటుకు సమర్పించిన 2021 కేంద్ర బడ్జెట్ మన దేశ ప్రజలను ఉత్తేజపరిచిందని ప్రధాని కొనియాడారు. ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని చెబుతూ వేగంగా అభివృద్ధి చెందాలని, సమయాన్ని నష్టపోకూడదని జాతి మానసికంగా సిద్ధమైందని చెప్పారు.
దేశ మానసిక స్థితిని నిర్ణయించడంలో యువత ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. వ్యవస్థను చిక్కుల్లో పెట్టే చట్టాలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. భారత దేశాన్ని స్వయం సమృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మన అవసరాల కోసం మాత్రమే కాకుండా, ప్రపంచ అవసరాలను తీర్చగలిగే ఉత్పత్తులను తయారు చేసే దేశంగా భారత దేశాన్ని నిర్మించే విధానమే స్వయం సమృద్ధ భారత్ కార్యక్రమమని చెప్పారు.
More Stories
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం
అమెరికా చదువులపై భారత విద్యార్థుల అనాసక్తి