బెంగాల్ మంత్రిపై బాంబ్ దాడిపై రాజకీయ దుమారం  

పశ్చిమ బెంగాల్ మంత్రి జకీర్ హుస్సేన్‌పై బుధవారం ముర్షిదాబాద్, నిమ్టిట రైల్వే స్టేషన్ వద్ద జరిగిన బాంబు దాడి చుట్టూ రాజకీయ దుమారం  రేపుతున్నది. గుర్తు తెలియని వ్యక్తులు బాంబు విసరడంతో సుమారు 26 మంది గాయపడ్డారు. ఆయనను కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. 
 
మంత్రి జకీర్ హుస్సేన్‌పై దాడి ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. కొందరు వ్యక్తులు తమ పార్టీలో చేరాలని జకీర్‌పై ఒత్తిడి తెచ్చారన్నారు. ఆయనను హత్య చేయాలని కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  నిజాలను బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
 
పేలుడు జరిగినపుడు రైల్వే అధికారులు ఆ ప్రదేశంలో లేరని, లైట్లు కూడా వెలగలేదని అనే చెప్పారు. రైల్వేల యాజమాన్యంలోని స్థలంలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు. పైగా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చోట ఈ దాడి జరిగినదని గుర్తు చేశారు. 
అయితే, రైల్వే స్టేషన్‌లో  బాంబు దాడి ఘటనకు రైల్వేల లోపభూయిష్ట తీరే కారణమన్న మమతా బెనర్జీ ఆరోపణలపై భారతీయ రైల్వే వర్గాలు ఖండించాయి. శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ అంశమని, ఈ ఘటనకు రాష్ట్ర పోలీసులే బాధ్యులని రైల్వేలు స్పష్టం చేశాయి.
శాంతిభద్రతల అంశం తమ పరిధిలోకి రాదని, రైల్వే స్టేషన్‌ ఫ్లాట్‌ఫాంపై శాంతిభద్రతలను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని జీఆర్‌పీ చూసుకుంటుందని రైల్వేలు పేర్కొన్నాయి. ఘటన అనంతరం రైల్వే అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారని, క్షతగాత్రుల్లో కొందరిని మెరుగైన చికిత్స కోసం కోల్‌కతా తరలించారని తెలిపాయి.
కాగా, మంత్రి జాకీర్ హుస్సేన్‌పై జరిగిన బాంబు దాడిపై ఎన్‌ఐఏతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరి డిమాండ్‌ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో శాంతి, భద్రతలు లోపించాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రి జాకీర్  హుస్సేన్‌పై బాంబు దాడి ఘటనపై ఎన్‌ఐఏతో దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్‌ చేశారు.