ఈసారి విభిన్నంగా ‘పరీక్ష పే చర్చ’

వార్షిక పరీక్షల ముందు విద్యార్థులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే సంభాషణ కార్యక్రమం మళ్లీ ప్రారంభం కాబోతోంది. ఈ విషయాన్ని మోదీ  ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఈసారి ‘పరీక్ష పే చర్చ’ను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. 

తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం మార్చిలో జరుగుతుంది. ఈసారి విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాబోతున్నారు.  

మోదీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, ప్రజల డిమాండ్ మేరకు పరీక్ష పే చర్చ, 2021లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను కూడా భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. గంభీరమైన అంశంపై సరదా సరదాగా ఈ కార్యక్రమం సాగుతుందని చెప్పారు. 

‘‘నా విద్యార్థి మిత్రులు, వారి అద్భుతమైన తల్లిదండ్రులు, కఠోరంగా శ్రమించే ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలి’’ అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులంతా పాల్గొనవచ్చునని చెప్పారు. ‘‘చిరునవ్వుతో, ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరవుదాం, రండి’’ అంటూ ఆహ్వానించారు.

దేశానికి చెందిన విద్యార్థులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇతరులు కూడా తమ సందేహాలతో ముందుకు రావాలని వారిని ఇందుకు ఆహ్వానిస్తున్నానని ప్రధాని ట్వీటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లు గురువారం నుంచి ఆరంభం అయ్యాయి. ఈ విషయానిన కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. 

మార్చి 14వరకూ నమోదు ప్రక్రియ ఉంటుంది. 9 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చునని చెప్పారు. 2018 నుంచి ప్రధాని మొఓడీ పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో పరీక్షా సమయాలలో సహజంగానే పలు ప్రశ్నలు తలెత్తుతాయి. అంతకు మించి వారిలో రేపటి పరీక్షలలో పలు భయాలు నెలకొంటాయి. 

ఈ క్రమంలో వారు సరైన విధంగా చదవలేకపోవడం, చదివినా పరీక్షలలో సమాధానాలు సరిగ్గా రాయలేకపోవడం వంటి పలు చిక్కులు ఏర్పడుతున్నాయి.