అధికార మార్పిడికి కాదు… `సోనార్ బంగ్లా’ కోసమే!

బంగారు బెంగాల్‌ (సోనార్ బంగ్లా) ను తయారు చేయడానికే తాము పోరాటం చేస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలకు, సిండికేట్ తృణమూల్‌కు మధ్య జరుగుతున్న పోరుగా ఆయన అభివర్ణించారు. 

మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించడం తమ లక్ష్యం ఎంత మాత్రమూ కాదని, బెంగాల్‌లో పరిస్థితులను మార్చడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఐదో దశ పరివర్తన్ ర్యాలీని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గురువారం దక్షిణ 24 పరగణ జిల్లా కాక్‌ద్వీప్‌లో   ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు, పేదల బతుకు చిత్రాలు మార్చడమన్న ధ్యేయంగానే తాము ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ‘నమామి గంగే’ కార్యక్రమం అమలు కాకుండా అధికార తృణమూల్ అడ్డుకుంటోందని ఆరోపించారు. 

బీజేపీ వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ, స్వామి ప్రణవానంద ఇద్దరూ ఒకే సైద్ధాంతిక ఆలోచన గలవారని, వారిద్దరూ దేశం కోసం పనిచేశారని అమిత్ షా గుర్తు చేశారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ కారణంగానే నేడు బెంగాల్‌ ఉనికిలో ఉందని, లేదంటే ఎప్పుడో బంగ్లాదేశ్‌లో కలిసిపోయేదని పేర్కొన్నారు. 

మమత హయాంలో శాంతిభద్రతల పరిస్థితి బాగుందా? అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా రాష్ట్రం అభివృద్ధి పథంగా ముందుకెళ్తుందా? అని షా ప్రశ్నించారు. బీజేపీ గనక అధికారంలోకి వస్తే ఏడో వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తామని, 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని అమిత్‌షా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ఈ ఎన్నికల్లో బీజేపీనే గెలవబోతోందని, ప్రజలు తమకే బ్రహ్మరథం పడతారని అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. ‘‘బెంగాల్‌లో మహిళలకు సముచిత ప్రాధాన్యం దక్కలేదదు. మహిళా ముఖ్యమంత్రే ఉన్నప్పటికీ మహిళలు వెనకడబే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు 33 శాతం కంటే అధికారంగా రిజర్వేషన్ అమలు చేస్తాం” అంటూ ప్రకటించారు. బెంగాల్ ఓటర్లు బీజేపీవైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తూ బెంగాల్ మార్పును కోరుకుంటోందని అమిత్ షా చెప్పారు.